chalo collectorate
-
ఆ..వేదన వినండి!
ఎన్ని కన్నీటి చుక్కలు నేల రాలాయి.. ఇంకెన్ని గుండెలు ఆగిపోయాయి.. మరెన్ని కుటుంబాలు నాశనమయ్యాయి... అయినా కరకు రాతి సర్కారు గుండెలు కరగడం లేదు. అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాచుకున్నది ఒకరు, బిడ్డ చదువు కోసం పొదుపు చేసింది మరొకరు, సొంతింటి కల కోసం సొమ్ములు భద్రం చేసుకున్నది మరొకరు. కానీ అందరి కలలు కల్లలైపోయాయి. ఆశలు నీరుగారిపోయి బతుకులు రోడ్డు మీదకు వచ్చేశాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం వైఖరి వల్ల జిల్లాలో వేల కుటుంబాల్లో ఇలా కల్లోలం చెలరేగింది. ఇంత జరిగినా సామాన్యుల కన్నీరు ప్రభుత్వ పెద్దలను కదిలించలేదు. ఏ నినాదమూ వారి చెవికెక్కడం లేదు. ఆ..వేదన మనసును కదిలించడం లేదు. నేడు మరోసారి అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కనున్నారు. ఈ సారైనా ‘మా కష్టాన్ని వినండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. శ్రీకాకుళం సిటీ: సర్కారు ద్వంద్వ వైఖరిపై అగ్రిగోల్డ్ బాధితులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమతో కపట నాటకం ఆడొద్దని చెబుతున్నారు. సంస్థకు వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నా ఖాతాదారులకు చెల్లింపులు చేయడంలో తీవ్రంగా జాప్యం చేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించాలని, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు ఇరవై ఏళ్లు లావాదేవీలు నిర్వహించింది. కానీ టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఖాతా దారులకు డిపాజిట్లు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకుని ఖాతాదారులకు, ఏజెంట్లకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దమన నీతి పా టిస్తూ వారిని మరిన్ని అప్పుల్లోకి నెట్టేస్తోంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ ఖాతా దారులు, ఏజెంట్లు సమస్యల్లో చిక్కుకుపోయారు. జిల్లాలో 2.33 లక్షల మంది బాధితులు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు బాధితులు, ఏజెంట్లు అంతా మూకుమ్మడిగా సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్కువినతి పత్రం సమర్పించనున్నారు. రాష్ట్రంలో సీఐడీ లెక్కల ప్రకారం 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, జిల్లాలో (గత ఏడాది నవంబర్ 20వ తేదీనాటికి) 2,33,436 మంది బాధితులు పోలీసు రికార్డుల్లో నమోదై ఉన్నారు. జిల్లాలో సుమారు రూ.600 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. 1995లో ప్రారంభం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్, అండమాన్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో 1995వ సంవత్సరం నవంబర్ 9వ తేదీన అగ్రిగోల్డ్ కంపెనీని ప్రారంభించారు. 2015 జనవరి 4వ తేదీనాటికి కంపెనీని మూసివేసే సమయానికి జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ, రాజాంలో 9 బ్రాంచిలు ఉన్నాయి. జిల్లాలో 9 మంది వరకు బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్ని నిరసనలు చేసినా.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులంతా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బాధితులు నాలుగేళ్లుగా నిరశన దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు వంటివెన్నో నిర్వహించారు. అయినా నేటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేకపోయారు. బాధితులంతా కలెక్టరేట్‌కు రావాలి జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులంతా సోమవారం చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలి. నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను, స్థానిక శాసన సభ్యులను, సీఐడీ, పోలీసు అధికారులను కలిశాం. మాకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలను కూడా అందజేశాం. మమ్మల్ని ఎప్పటికప్పుడు బుజ్జగిస్తున్నారు. వారి హామీలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో బాధిత సోదరులను కూడా కోల్పోయాం. ప్రజా సమస్యగా భావించి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం.– పైడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ -
30న రుణమాఫీపై చలో కలెక్టరేట్
కరీంనగర్‌సిటీ: బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్యాంకర్లు రైతులపై వడ్డీభారాన్ని మోపారని ఉమ్మడి జిల్లా రైతు జేఏసీ కన్వీనర్ కె.రమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఈనెల 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంట రుణాల మాఫీకి నాలుగు విడతలుగా నిధులు మంజూరు చేసినప్పటికీ బ్యాంకులు అప్పు ఉన్నట్లు చూపించి.. రైతుల నడ్డి విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బ్యాంకులు వడ్డీ కిందనే జమ చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పు చెల్లించనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామంటూ బ్యాంకర్లు ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు చలో కలెక్టరేట్ చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జగన్రావు, ప్రభాకర్, ఓదెలు, లలిత, శ్రీను తదితరులు ఉన్నారు. -
సమస్యల సాధనకు పోరాటాలే శరణ్యం
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలు అలాగే ఉండిపోయాయని, వాటి పరిష్కారానికి ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ హెచ్‌యూజే ఆధ్వర్యంలో ఈ నెల 22న చేపట్టే ‘చలో కలెక్టరేట్’ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార రాజకీయ పక్షం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచినా ఏ ఒక్కటీ అమ లు పరచటం లేదన్నారు. అందుకే ఓపిక నశించి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరులందరూ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందే విధంగా జీఓ 239 సవరించి, తక్షణమే కొత్త రాష్ట్రం అక్రెడిటేషన్లు జారీ చేయాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలో హెల్త్ స్కీము అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న సీఎం హామీని తక్షణం అమలు చేయాలని కోరారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సబ్ ఎడిటర్లకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా ఆంధ్రా అక్రెడిటేషన్లే కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రచార కరపత్రాలను విరాహత్ అలీ విడుదల చేశారు. హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హెచ్‌యూజే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శంకర్ గౌడ్, సహయ కార్యదర్శి కోన సుధాకర్ రెడ్డి నాయకులు సంపత్, గౌస్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు. -
22న ‘ఛలో కల్టెరేట్’
గజ్వేల్: అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు. గురువారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు గడిచినా... ఆరోగ్య బీమా కార్డులు, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూం పథకం, అక్రిడిటేషన్ కార్డుల జారీ తదితర సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. 22న ఉదయం 11గంటలకు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సంగారెడ్డిలోనూ ఇదే సమయానికి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ‘ఛలో కలెక్టరేట్’ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రంగాచారి, జిల్లా నాయకులు ఫైసల్ అహ్మద్, రవిచంద్ర, దుర్గారెడ్డి పాల్గొన్నారు. -
చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
• సీఐటీయూ రాష్ట్ర నేత జి.ఓబులు హిందూపురం రూరల్ : గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్ట సాధన lకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు జి.ఓబులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తూమకుంట పారిశ్రామిక వాడలో గార్మెంట్స్ పరిశ్రమల ముందు చలో కలెక్టరేట్ సెప్టెంబర్ 2న జరుగబోయే దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని కరపత్రాలు పంపిణీ చేశారు. గార్మెంట్స్ అనుబంధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్మిక శాఖాధికారులు యాజమాన్యంతో లాలూచీ పడి చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం నిరసన చేపట్టిన విప్రో కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, పురుషోత్తం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.