ఎన్ని కన్నీటి చుక్కలు నేల రాలాయి.. ఇంకెన్ని గుండెలు ఆగిపోయాయి.. మరెన్ని కుటుంబాలు నాశనమయ్యాయి... అయినా కరకు రాతి సర్కారు గుండెలు కరగడం లేదు. అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాచుకున్నది ఒకరు, బిడ్డ చదువు కోసం పొదుపు చేసింది మరొకరు, సొంతింటి కల కోసం సొమ్ములు భద్రం చేసుకున్నది మరొకరు. కానీ అందరి కలలు కల్లలైపోయాయి. ఆశలు నీరుగారిపోయి బతుకులు రోడ్డు మీదకు వచ్చేశాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం వైఖరి వల్ల జిల్లాలో వేల కుటుంబాల్లో ఇలా కల్లోలం చెలరేగింది. ఇంత జరిగినా సామాన్యుల కన్నీరు ప్రభుత్వ పెద్దలను కదిలించలేదు. ఏ నినాదమూ వారి చెవికెక్కడం లేదు. ఆ..వేదన మనసును కదిలించడం లేదు. నేడు మరోసారి అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కనున్నారు. ఈ సారైనా ‘మా కష్టాన్ని వినండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు.
శ్రీకాకుళం సిటీ: సర్కారు ద్వంద్వ వైఖరిపై అగ్రిగోల్డ్ బాధితులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమతో కపట నాటకం ఆడొద్దని చెబుతున్నారు. సంస్థకు వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నా ఖాతాదారులకు చెల్లింపులు చేయడంలో తీవ్రంగా జాప్యం చేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించాలని, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు ఇరవై ఏళ్లు లావాదేవీలు నిర్వహించింది. కానీ టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఖాతా దారులకు డిపాజిట్లు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకుని ఖాతాదారులకు, ఏజెంట్లకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దమన నీతి పా టిస్తూ వారిని మరిన్ని అప్పుల్లోకి నెట్టేస్తోంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ ఖాతా దారులు, ఏజెంట్లు సమస్యల్లో చిక్కుకుపోయారు.
జిల్లాలో 2.33 లక్షల మంది బాధితులు
జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు బాధితులు, ఏజెంట్లు అంతా మూకుమ్మడిగా సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్‌కువినతి పత్రం సమర్పించనున్నారు. రాష్ట్రంలో సీఐడీ లెక్కల ప్రకారం 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, జిల్లాలో (గత ఏడాది నవంబర్ 20వ తేదీనాటికి) 2,33,436 మంది బాధితులు పోలీసు రికార్డుల్లో నమోదై ఉన్నారు. జిల్లాలో సుమారు రూ.600 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
1995లో ప్రారంభం
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్, అండమాన్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో 1995వ సంవత్సరం నవంబర్ 9వ తేదీన అగ్రిగోల్డ్ కంపెనీని ప్రారంభించారు. 2015 జనవరి 4వ తేదీనాటికి కంపెనీని మూసివేసే సమయానికి జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ, రాజాంలో 9 బ్రాంచిలు ఉన్నాయి. జిల్లాలో 9 మంది వరకు బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఎన్ని నిరసనలు చేసినా..
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులంతా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బాధితులు నాలుగేళ్లుగా నిరశన దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు వంటివెన్నో నిర్వహించారు. అయినా నేటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేకపోయారు.
బాధితులంతా కలెక్టరేట్‌కు రావాలి
జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులంతా సోమవారం చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలి. నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను, స్థానిక శాసన సభ్యులను, సీఐడీ, పోలీసు అధికారులను కలిశాం. మాకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలను కూడా అందజేశాం. మమ్మల్ని ఎప్పటికప్పుడు బుజ్జగిస్తున్నారు. వారి హామీలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో బాధిత సోదరులను కూడా కోల్పోయాం. ప్రజా సమస్యగా భావించి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోతే భవిష్యత్ కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం.– పైడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment