కరీంనగర్‌సిటీ: బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్యాంకర్లు రైతులపై వడ్డీభారాన్ని మోపారని ఉమ్మడి జిల్లా రైతు జేఏసీ కన్వీనర్ కె.రమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఈనెల 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంట రుణాల మాఫీకి నాలుగు విడతలుగా నిధులు మంజూరు చేసినప్పటికీ బ్యాంకులు అప్పు ఉన్నట్లు చూపించి.. రైతుల నడ్డి విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులను బ్యాంకులు వడ్డీ కిందనే జమ చేసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పు చెల్లించనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామంటూ బ్యాంకర్లు ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు చలో కలెక్టరేట్ చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జగన్‌రావు, ప్రభాకర్, ఓదెలు, లలిత, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment