కరీంనగర్ అగ్రికల్చర్ :
రుణమాఫీ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో పరీక్ష పెట్టింది. కచ్చితమైన అర్హుల జాబితా కోసం వడపోతకు శ్రీకారం చుట్టింది. 16 నుంచి 23 వరకు రుణమాఫీ మేళాలు నిర్వహించి అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. తొలివిడత మాఫీ ఇప్పటికే మంజూరు కాగా, మలి మూడు విడతల మాఫీకి ఈ సర్టిఫికెటే ప్రమాణికం కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రుణమాఫీలో ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది.
రెన్యూవల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ అని స్పష్టం చేసిన ప్రభుత్వం, పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంకర్లకు చూపించాలని మెలికపెట్టింది. బ్యాంకర్లు డిక్లరేషన్ చేసిన రైతుల జాబితా ప్రామాణికంగా అర్హులను గుర్తించనున్నారు. రైతులు బ్యాంకులకు వెళ్లి స్వయంగా పాసుపుస్తకాలతో పంట రుణం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో రుణం అవసరం లేదని బ్యాంకర్లకు లేఖ రాసిచ్చే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ జరిగితేనే బ్యాంకర్లు డిక్లరేషన్ ఇచ్చి జిల్లా యంత్రాంగానికి నివేదించనున్నారు. వ్యవసాయశాఖకు బ్యాంకర్లు ఇచ్చే నివేదిక ద్వారా చాలా మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశాలున్నాయి.
గతంలో పంట రుణం తీసుకున్న రైతు నష్టాలు వచ్చి సదరు భూమిని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఉపాధి నిమిత్తం పలువురు రైతులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నవారు, వృద్ధాప్యంతో మరణించిన రైతులు రుణమాఫీ అర్హుల జాబితాలో ఉన్నారు. వీరంతా బ్యాంకులకు వచ్చే అవకాశం లేకపోవడంతో రుణమాఫీ కష్టమే.
రుణమాఫీ తీరిది: జిల్లాలో 3,80,203 మంది రైతులకు రూ.1694.28 కోట్లు రుణాలు మాఫీ కానున్నాయి. మొదటి విడతగా 25శాతం రూ.423.57 కోట్లు విడుదల చేశారు. 1,448 మంది రైతులకు సంబంధించి రూ.3.76 కోట్లు వివిధ కారణాలతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరో రూ.3 కోట్లు సర్దుబాటు చేయనున్నారు. రుణమాఫీ అర్హతగల 3,30,457 మంది రైతులు పంట రుణాలు రెన్యూవల్ చేసుకుని రూ.1673.74 కోట్లు రుణం పొందారు.
వడపోత గుబులు: జిల్లాలో గుర్తించిన రైతులందరికీ రుణమాఫీ కింద మొదటి విడత సొమ్ము బ్యాంకుల్లో జమైంది. బ్యాంకర్ల డిక్లరేషనే ప్రామాణికం కావడం... అవగాహన లేని, వలస వెళ్లిన, మృతి చెందిన, భూములు లేక, రెన్యూవల్ చేసుకోకపోవడం వంటి కారణాలతో రైతులు, వారి కుటుంబసభ్యుల్లో గుబులు మొదలైంది. రెన్యూవల్ చేసుకోనివారు తమకు రుణం అవసరం లేదని బ్యాంకుల్లో రాసిస్తే సరిపోతుందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించే రుణమాఫీ మేళాలో అన్ని గ్రామాల్లో తహశీల్దార్ సంతకంతో రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. ఈ పత్రాలు పొందిన రైతులే 2016, 2017, 2018ల్లో మూడు విడతలుగా వచ్చే రుణమాఫీకి అర్హులవుతారు. కాగా, కొర్రీలతో అర్హులకు అన్యాయం చేయొద్దని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి.
పత్రముంటేనే మాఫీ
Published Wed, Feb 4 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement