సమస్యలపై విక్రమార్కుల్లా పోరాడండి
♦ సమష్టిగా ప్రయత్నిస్తే సాధ్యపడనిది ఏదీ లేదు
♦ యువ ఇంజనీర్లకు మంత్రి కేటీఆర్ హితబోధ
♦ కొత్త ఏఈఈలకు పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో ఎక్కడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లేదు. ఇళ్లు, కాలనీలను విచ్చలవిడిగా నిర్మించారు. కనీస సౌకర్యాలు, మంచినీరు, డ్రైనేజీలు లేవు. గట్టిగా తలుచుకుని సమష్టిగా ప్రయత్నిస్తే సాధ్యపడనిది ఏదీ లేదు. మీరు కార్యాలయంలో అడుగుపెట్టగానే సమస్యలు స్వాగతం పలుకుతాయి. వాటిని సవాలుగా స్వీకరించండి. మేము చేయలేమని నిర్వేదంలోకి జారిపోకండి. పట్టువీడని విక్రమార్కుల్లా వెంటపడి సమస్యలను పరిష్కరించండి’’ అని పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హితబోధ చేశారు.
పురపాలక శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం కొత్త ఏఈఈలకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పబ్లిక్ హెల్త్‌లో 124 మంది ఏఈఈలు ఎంపికవగా 118 మంది రిపోర్టు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల వైఫల్యంతో ఈరోజు గ్రామాలు, పట్టణాలు ఆశిం చిన స్థాయిలో లేవు. ప్రభుత్వాధికారులు, రాజ కీయ నేతలపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. దీన్ని మార్చే అవకాశం మీకు వచ్చింది’’ అన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే పురపాలన సాధ్యమన్న కేటీఆర్... ప్రజలపై చిరాకుపడే వారు ఈ ఉద్యోగానికి అనర్హులని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణకు తగ్గట్లు మౌలికసదుపాయాల కల్పనలో సవాళ్లు ఎదురవుతున్నాయని... 2011 జనాభ లెక్కల ప్రకారం తెలంగాణలో 38.7 శాతం ఉన్న పట్టణీకరణ ప్రస్తుతం 42 శాతానికి మించిందని... మరో పదేళ్లలో ఇది 50 శాతాన్ని దాటుతుందన్నారు. విచ్చలవిడితనానికి అడ్డుకట్టు వేసి ప్రణాళికబద్ధ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వారంలో మరో 283 మంది ఏఈలను నియమిస్తామన్నారు.
పుష్కలంగా నిధులు...
మున్సిపాలిటీల్లో నిధుల్లేవని భావించొద్దని...రాష్ట్రంలోని ఐదు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 700 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలకు రూ. 500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమృత్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాలకు కేంద్రం నుంచి ఐదేళ్లలో రూ. 1,400 కోట్లు వస్తాయన్నారు. రాష్ట్రంలోని రెండు, మూడు పట్టణాలకు స్మార్ట్ సిటీ హోదా కల్పి స్తూ వచ్చే నెలలో జాబితా విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారన్నారు. స్మార్ట్ సిటీలకు ఏటా రూ. 100 కోట్లు వస్తాయన్నారు.
ఈ నిధులకుతోడు టీయూఎఫ్‌ఐడీ ఆధ్వర్యంలో రూ. 1,500 కోట్లతో మూలధనాన్ని ఏర్పాటు చేసి పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లను కేటాయించనుందని, మిగిలిన రూ. 850 కోట్లను రుణాలుగా సమీకరిస్తామన్నారు. రాష్ట్రంలోని 85 లక్షల కుటుం బాలకు నల్లా ద్వారా రక్షిత నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతం చేయాలని ఇంజనీర్లకు కేటీఆర్ సూచించారు. కొత్త, పాత ఇంజనీర్లకు త్వరలో ఎంసీహెచ్‌ఆర్డీలో శిక్షణ, పునశ్చరణ తరగతు లు నిర్వహించాలని పురపాలకశాఖను ఆదేశిం చారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, పురపాలకశాఖ డెరైక్టర్ దానకిశోర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ధన్‌సింగ్, డీటీసీపీ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.