గ్రేటర్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు ఆదివారం భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో డివిజన్కు పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుతో జోనల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా ఏడు డివిజన్ల అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ప్రకటించలేదు.
కాంగ్రెస్ పార్టీ 94 డివిజన్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ 87 స్థానాలు, బీజేపీ 63 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం. కాగా చివరి నిమిషంలో 81 డివిజన్లకు టీటీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసినా బీజేపీ మాత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. దీంతో పార్టీకి కేటాయించిన డివిజన్లలోని ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల చేత బీజేపీ నామినేషన్ల దాఖలు చేయించింది.
అభ్యర్థుల జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించనుంది. ఎంఐఎం పార్టీ మాత్రం 65 సీట్లలో పోటీకి సిద్ధమైంది. నామినేషన్లు రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జనవరి 21వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 2వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 5వ తేదీన కౌంటింగ్ జరిగి... ఫలితాలు వెలువడనున్నాయి.