► 31 జిల్లాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర... తెరపైకి ఆసిఫాబాద్
► గద్వాల, సిరిసిల్ల, జనగామలపై ఏకాభిప్రాయం
► అంతా దసరా చేసుకుంటుంటే వాళ్లెందుకు బాధ పడాలె?
► అధికారులతో ముఖ్యమంత్రి వ్యాఖ్య
► హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దు
► కొత్తగా వరంగల్ రూరల్, అర్బన్
► జిల్లాలపై కేకే నేతృత్వంలో హైపవర్ కమిటీతో అధ్యయనం
► రెండ్రోజుల్లో తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 31 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు. దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటే ఈ ప్రాంతాల ప్రజలు మాత్రం బాధపడటం మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్తగా ఈ నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీతో అధ్యయనం చేయిస్తామని, రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ నాలుగు జిల్లాలను ఏయే మండలాలతో కలిపి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున వీటి సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని సీఎం మరోమారు స్పష్టంచేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో ఆయన చర్చించారు.
మూడు లక్షల కుటుంబాలకు ఓ జిల్లా
చిన్న పాలనా విభాగాలే మంచి ఫలితాలిస్తాయని ప్రపంచవ్యాప్తంగా గతానుభవాలు సూచిస్తున్నాయని, అదే స్ఫూర్తి తో తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతీ జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వవ్యస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని అన్నారు.
సిరిసిల్లకు రాజన్న జిల్లా పేరు
వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేసే విషయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ముసాయిదాలో ఉన్న హన్మకొండ జిల్లా రద్దయినట్లయింది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచిం చారు. కొత్తగూడెం జిల్లాకు ‘భద్రాది కొత్తగూడెం’గా పేరు పెట్టాలని నిర్ణయించారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
వికారాబాద్, మహబూబాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాలకు అవే పేర్లను కొనసాగించాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదించిన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లితోపాటు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలని, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో, హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు.
మండలాలు అటూ.. ఇటూ..
వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆరు మండలాలు (ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిందేవి పల్లి, సుజాత నగర్, అన్నపురెడ్డి) ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భూపాలపల్లి జిల్లాలోని ములుగు కేంద్రానికి ఉన్న ప్రాధాన్యం, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంథని రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించి, పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడూరు, భూపాలపల్లిలో టేకుమట్ల మండలాల ఏర్పాటును ప్రతిపాదించారు.
జిల్లాలపై నేతల్లో ఏకాభిప్రాయం
వరుసగా రెండ్రోజుల చర్చల తర్వాత కొత్త జిల్లాలపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 4, మెదక్‌లో 3, రంగారెడ్డిలో 3, నల్లగొండలో 3, ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 2, ఖమ్మంలో 2 జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మాత్రమే మారకుండా ఒక జిల్లాగా ఉండబోతుంది. మొత్తంగా తెలంగాణలో 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
పాత తప్పు చేయొద్దు
గతంలో మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ జోక్యం ఎక్కువైందని, ఇప్పుడలా జరగడానికి వీల్లేదని సీఎం స్పష్టంచేశారు. ‘‘అప్పుడు నాయకులు తమ స్వార్థం మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మండలాల కూర్పు ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అర్హతలున్నా కొన్ని మండల కేంద్రాలు కాలేకపోయాయి. ఇప్పుడలా జరగవద్దు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జరగాలి. గతంలో జరిగిన పొరపాట్లను సవరించాలి. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉన్నా సరే వాటిని సమీప మండలంలో కలపాలి’’ అని సూచించారు.
2022 నాటికి రూ.5 లక్షల కోట్ల బడ్జెట్
2022 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని సీఎం చెప్పారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి దేశంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ పేదరికం పోలేదు. దళితులు బాగుపడలేదు. పేదలు పేదలుగానే ఉన్నారు. అందుకే పాలకులకు తృప్తి లేదు. వెలితి అలాగే ఉంటున్నది. ఈ పరిస్థితి నుంచి బయటపడే చక్కని అవకాశం తెలంగాణ రాష్ట్రానికున్నది. మంచి ఆదాయ వనరులున్నాయి. సానుకూల పరిస్థితులున్నాయి. అందుకే తెలివిగా పేదరికంపై యుద్ధం చేయాలి. రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమికొట్టాలి. 2022 నాటికి తెలంగాణ బడ్జెట్ అయిదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అప్పటికీ తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి.
విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం లాంటి భారీ పెట్టుబడులతో చేసే పనులు పూర్తవుతాయి. మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటి కొన్ని పనులు మాత్రమే ఉంటాయి. అప్పుడు మన చేతిలో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బులన్నీ పేదరిక నిర్మూలనకే వినియోగిస్తాం. ప్రతీ కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతీ కుటుంబ స్థితిగతులు మంత్రులు, కలెక్టర్ కంప్యూటర్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ ఒక్క కుటుంబం వృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందిస్తారు. తెలంగాణకు వచ్చిన ఆదాయం పేదరిక నిర్మూలనకే కేటాయిస్తాం’’ అని సీఎం అన్నారు.
కొత్తగా తెరపైకి ఆసిఫాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మితోపాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించారు. దీంతో కొత్త జిల్లా కూర్పుపై సీఎం అప్పటికప్పుడు ప్రత్యేకంగా కసరత్తు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాను 20 మండలాలతో, కొమురంభీం మంచిర్యాల జిల్లాను 13 మండలాలతో, ఆసిఫాబాద్ జిల్లాను 15 మండలాలతో, నిర్మల్ జిల్లాను 18 మండలాలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రూపొందింది. కొత్తగా జిల్లాలో 16 మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బెల్లంపల్లి, ముధోల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగర పంచాయతీగా మార్చాలని, బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ప్రజాభీష్టమే ఫైనల్
Published Tue, Oct 4 2016 2:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement