హైదరాబాద్ లో తొలి మహిళా స్నాచర్‌ | First ever lady chain snatcher in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో తొలి మహిళా స్నాచర్‌

Published Sat, Aug 31 2013 2:55 AM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

First ever lady chain snatcher in hyderabad

సాక్షి, సిటీబ్యూరో: ముంబైకి చెందిన ఓ యువతి తల్లితో కలిసి నగరానికి వచ్చింది... కాల్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది... తన ఇంటి పక్కనే ఉండే యువకుడితో పరిచయమైంది... ఇద్దరూ కలిసి జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ ప్రారంభించారు... యువకుడు బైక్ నడుపుతుండగా ఆమె వెనుక కూర్చుని మహిళల మెడలోని బంగారు గొలుసులు స్నాచింగ్ చేస్తోంది. వీరికి మరో ముగ్గురు బాల్య స్నేహితులు తోడు కావడంతో మరింత రెచ్చిపోయారు.

ఈ ముఠాను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేయడంతో నగర కమిషనరేట్‌లో తొలి మహిళా స్నాచర్‌ను అరెస్టు చేసినట్లైంది. 19 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులైన నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. శుక్రవారం సిటీ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... ముంబైకి చెందిన సనాఖాన్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది.

ఆ తర్వాత తల్లితో కలిసి నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడింది.  ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇంటి పక్కన ఉండే మహ్మద్ షోయబ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. జల్సాలకు బానిసైన వీరిద్దరూ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నాచర్లుగా మారారు.

అనుమానం రాదనే యువతితో కలిసి...


చోరీల కోసం జెట్‌స్పీడ్‌లో వెళ్లై ఖరీదైన బైక్‌ను కొన్నారు. దానిపై ఇద్దరూ నగరంలో తిరిగేవారు. నిర్మానుష్య ప్రాంతాల్లో బంగారు వస్తువులు ధరించి వస్తున్న యువతులకు సమీపంగా వాహనంపై వెళ్లేవారు.  వెనుక యువతి ఉండటంతో ఎవ్వరూ వీరిని స్నాచర్లుగా అనుమానించేవారు కాదు. దీన్నే క్యాష్ చేసుకున్న ఈ ద్వయం వరుసపెట్టి స్నాచింగ్స్‌కు పాల్పడింది. షోయబ్ వాహనం నడుపుతుండగా సనా గొలుసులు తెంచేది. ఇలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేసేవారు.

వీరి జీవనశైలికి బాల్య స్నేహితులైన ముఫదుల్ (తిరుమలగిరి), ఇంజినీరింగ్ విద్యార్థులైన వీకేఎస్ రాఘవ (శ్రీ నగర్‌కాలనీ), జేఎస్ భార్గవ (యూసుఫ్‌గూడ)లు ఆకర్షితులై మరో వాహనంపై తిరుగుతూ గొలుసు చోరీలు మొదలెట్టారు. ఈ రకంగా జంట కమిషనరేట్ల పరిధిలో 23 స్నాచింగ్స్ చేశారు. చోరీ సొత్తును తమకు పరిచయస్తులైన నరేష్, అష్వద్‌లకు విక్రయించేవారు. ఇలా వచ్చిన సొమ్ముతో  జూదం, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు ఖర్చు చేయడంతో పాటు ఒక కారు, ఎవరికి వారు సొంత బైక్‌లు కొనుగోలు చేశారు.

వాహన తనిఖీల్లో చిక్కిన వైనం...


జంట కమిషనరేట్ల పలువురు చేసిన ఫిర్యాదులతో పాటు గతనెల్లో తిరుమలగిరి ఠాణా పరిధిలో జరిగిన గొలుసు చోరీలో సిటీలో ఓ మహిళా స్నాచర్ ఉన్నట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. బోయిన్‌పల్లి పోలీసులు గురువారం సాయంత్రం ఓల్డ్ బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. స్విఫ్ట్ కారులో ఓ యువతి, యువకుడు వెళ్తుండగా పోలీసులు ఆపబోగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని వాహనంలో తనిఖీ చేయగా మూడు గొలుసులతో పాటు బంగారం తూకం వేసే త్రాసు కనిపించింది. తదుపరి విచారణలో తన పేర్లు షోయబ్, సనా అని చెప్పడంతో పాటు నేరాలనూ అంగీకరించారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు  మిగిలిన ముగ్గురితో పాటు ఇద్దరు రిసీవర్లనూ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 70 తులాల బంగారం, కారు, మూడు ద్విచక్ర వాహనాల సహా మొత్తం రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రత్యేక బృందాలు: సీపీ


గొలుసు దొంగతనాలతో పాటు దృష్టి మళ్లించి చోరీలు చేస్తున్న నేరగాళ్లకు చెక్ చెప్పేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇటీవల కాలంలో ఈ నేరాలు పెరిగిపోవడంతో జోనల్, డివిజన్ స్థాయిలో ప్రత్యేక టీమ్స్‌ను నియమించామన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, కేసులు కొలిక్కితేవడానికి సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించి తమకు సహకరిస్తేనే పూర్తిస్థాయిలో ఫలితాలుంటాయన్నారు. ముఖ్యంగా సూడో పోలీ సులు అంశానికి సంబంధించి నగర పోలీసులు ఎవ్వరూ మఫ్టీల్లో ఉండి తనిఖీలు చేయరని, బృం దంలో కనీసం ఒక్కరైనా ఖాకీ దుస్తుల్లో ఉంటారన్నది గుర్తుంచుకోవాలని కమిషనర్ కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement