సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రాంతాలు, పార్క్‌లు, జాతీయ రహదారుల వెంట చేప వంటకాలను విక్రయించేందుకు కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. అలాగే విజయ డెయిరీ విక్రయాలు పెంచుకోవడానికి రాష్ట్రంలో వెయ్యి డెయిరీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థలకు విజయ ఉత్పత్తులు సరఫరా జరిగేలా చూడాలన్నారు.
శనివారం ఆయన సచివాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 40 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించామని తెలిపారు. కాల్‌సెంటర్‌పై ఒత్తిడి తగ్గించేలా ప్రస్తుతమున్న సిబ్బందిని పెంచాలన్నారు. కాల్‌సెంటర్‌కు, ప్రధాన పశువైద్యశాలలకు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవిలో జీవాలకు గ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. గోపాలమిత్రులకు కనీస భృతి చెల్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలన్నారు. గొర్రెలకు షెడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సమీక్షలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కన్నెబోయిన రాజయ్యయాదవ్, రాజేశ్వరరావు, సువర్ణ, నిర్మల, లక్ష్మారెడ్డి, డాక్టర్ మంజువాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment