వరద సఫారీ!
నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను ముంచెత్తుతున్న వరద నీరు
- నాలాల కబ్జాతో ఉప్పొంగుతున్న మీరాలం చెరువు
- ప్రహరీని దాటి పార్క్‌లోకి ప్రవాహం... జంతు ప్రేమికుల ఆందోళన
హైదరాబాద్: ఇటీవల నగరంలో కురిసిన కుండపోత వర్షాలు ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ప్రాణసంకటంగా మారాయి. భారీ వర్షాల కారణంగా జంతు ప్రదర్శనశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న మీరాలం ట్యాంక్ ఉప్పొంగుతోంది. చెరువుకు సంబంధించిన నాలాలు కబ్జాకు గురికావడం.. వరద నీరు బయటికి సాఫీగా వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరద నీరు నేరుగా జూపార్కులోకి ప్రవేశిస్తోంది. సుమారు 30 అడుగుల ఎత్తున్న జూ ప్రహరీని దాటిమరీ వరద నీరు పార్క్‌ను ముంచెత్తుతోంది. ఐదు రోజులుగా జూపార్కులోని సింహం, పులుల సఫారీల్లోకి భారీగా వరదనీరు చేరడంతో వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటున్నాయి.
కబ్జాలతోనే ఈ దుస్థితి..
జూపార్కు ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న మీరాలం చెరువు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఉప్పొంగుతోంది. చెరువుకు సహజసిద్ధంగా ఉన్న నాలాలు, తూములు కబ్జాలకు గురికావడంతో వరద నీరు బయటికి వెళ్లే పరిస్థితులు లేకుండాపోయాయి. సుమారు 30 అడుగుల ఎత్తున ఉన్న జూప్రహరీని దాటి వరదనీరు పార్క్‌ను ముంచెత్తుతోంది. దీంతో జూపార్కులోని ఓపెన్ లయన్ సఫారీలోకి వరదనీరు చేరుతోంది. ఇలా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ లయన్ సఫారీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సందర్శకులకు వన్యప్రాణులను చూసే భాగ్యం దక్కడంలేదు. లయన్ సఫారీలోకి చేరిన నీరు బయటికి సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు లేకపోవడంతో జూపార్క్ అధికారులు లయన్ సఫారీని మూసేస్తున్నారు. వరద నీరు చేరడంతో ఈ నెల 15, 16వ తేదీల్లో పార్కులోకి సందర్శకులను అనుమతించలేదు. వరదనీరు కొద్దిగా తగ్గడంతో 17వ తేదీన సందర్శకులను అనుమతించారు. ఆదివారం కూడా వరదనీరు జూపార్కులోని కుంటల్లోకి ప్రవేశించడంతో సందర్శకులను అనుమతించలేదు. దీంతో సెలవురోజున జూపార్కును చూసేందుకు వచ్చిన సందర్శకులు నిరుత్సాహానికి గురయ్యారు.
పరిష్కారం ఇలా..
మీరాలం చెరువుకు సహజసిద్ధంగా ఉన్న తూములు, నాలాలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలి. ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. వరద ప్రవాహం సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయాలి. జూపార్క్ ప్రహరీ గోడ ఎత్తును పెంచాలి.
80 ఎకరాలు కబ్జా..?
1963లో అందుబాటులోకి వచ్చిన నెహ్రూ జూలాజికల్ పార్కు అప్పట్లో 380 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇందులో 80 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు సమాచారం. జూపార్కు ఏర్పడిన కొత్తలో నిర్ధిష్టమైన ప్రహరీ లేకపోవడం, పక్కనే మీరాలం చెరువు ఉండటం, జూపార్కు చుట్టూ బస్తీలు ఏర్పడటం వంటి కారణాలతో జూపార్కు కుంచించుకుపోయింది.
అరుదైన జీవజాలానికి ఆలవాలం..
జూపార్క్‌లో ప్రస్తుతం 158 జంతు జాతులకు చెందిన సుమారు 1,500 జంతువులు, అరుదైన పక్షులు, పాములు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. పర్యావరణ, జీవావరణ వ్యవస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. హార్న్‌బిల్, పెలికాన్, ఫ్లెమింగో, సారాస్ క్రేన్, లవ్‌బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరీ పిల్లులు తదితర నిశాచరులు, ఆసియాటిక్ సింహాలు, తెల్లపులులు, చిరుత, జాగ్వార్ రకం చిరుత పులి, సరీసృపాల జగత్తులో రస్సల్ వైపర్, రాక్‌ఫైథాన్, లెటిక్యూలేటెడ్ పైథాన్ వంటి కొండ చిలువలు, ఆఫ్రికన్ చింపాంజీ, జంట ఖడ్గమృగాలు, నీటి గుర్రాలు జూకు ప్రత్యేక ఆకర్షణ. అడవిని పోలిన లయన్, టైగర్, బేర్, బైసన్(ప్రస్తుతం నీల్గాయ్) వంటి నాలుగు సఫారీ పార్కులు ఉన్నాయి. 25 అరుదైన వన్యప్రాణులను సందర్శకులు వాహనాల్లో ఉండి సురక్షితంగా తిలకించవచ్చు.
సమస్య పరిష్కారానికి కృషి...
జూపార్కులో సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులు అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కోరారు. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జూపార్కును సందర్శించి పరిస్థితిని స్వయంగా అంచనా వేశారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.
- శివానీ డోగ్రా, జూపార్కు క్యూరేటర్
జంతువులకు ప్రమాదం లేదు
మీరాలం వరదనీరు జూను ముంచెత్తినా.. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదు. లయన్ సఫారీలోని లయన్, టైగర్, అడవి దున్న, ఎలుగుబంటిలను నైట్‌హౌస్‌కు తరలించి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆరోగ్యపరంగా జంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులో ఉంది.
- ఎంఏ హకీం,జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్