ఫుట్‌పాత్ ఆక్రమణలపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. పాదచారులు నడిచేందుకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై ‘భూ ఆక్రమణల..
=జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
=చర్యలపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్ ఆక్రమణలపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. పాదచారులు నడిచేందుకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై ‘భూ ఆక్రమణల నిరోధక చట్టం’ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. ఫుట్‌పాత్ ఆక్రమణల నిరోధానికి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? కోర్టు ఆదేశాల తరువాత ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు చేశారు? తదితర వివరాలతో నాలుగు వారాల్లోపు నివేదికను తమ ముందుంచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని, పాదచారులు నడిచేందుకు కనీసం పేవ్‌మెంట్లు కూడా నిర్మించడం లేదని, దీని వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ విశ్రాంత సైనికాధికారి బ్రిగేడియర్ వీరేందర్ పి.శర్మ హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే ఫుట్‌పాత్‌ల ఆక్రమణల నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆక్రమణదారులపై సివిల్ కేసులు నమోదు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ న్యాయవాది చెప్పారు. సివిల్ కేసులు అయితే ఆక్రమణదారులపై పెద్దగా ప్రభావం చూపవని, ఇక నుంచి భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని.. ఆక్రమణల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.