అలా చేస్తే... బాహువులుబలి
సిటీయూత్‌లో బాహుబలి సినిమా ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్ తరహా ఫిజిక్ కోసం యువకులు జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. మెడ నుంచి వీపు దిగువ వరకూ ‘వి’ షేప్‌తో అదరగొట్టిన ప్రభాస్ తరహా లుక్ కోసం వీరు ట్రైనర్లను సంప్రదిస్తున్నారు. ‘ఒకటే షేప్ కోసం ప్రయాస పడడం కాదు. ఓవరాల్‌గా ఫిజిక్‌ను తీర్చిదిద్దుకోవాలి. అలా కాకపోతే ఫిజిక్ సమతుల్యం కోల్పోతుంది’అంటున్నారు ‘సోల్’ జిమ్‌కు చెందిన ట్రైనర్ వెంకట్. ఆయన చేస్తున్న సూచనలేమిటంటే...
వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాల పేరు లెటిజమ్ మజిల్. మొత్తం దేహంలోనే అతి పెద్ద మజిల్ ఇది. అప్పర్ బ్యాక్ బాడీ షేప్ మొత్తం నిర్దేశించే మజిల్‌గా దీన్ని చెప్పవచ్చు. ఈ భాగం సరైన రీతిలో పికప్ అయితేనే వి-షేప్ లుక్ వస్తుంది. అలాగే నడుం నుంచి లాట్స్ ప్రారంభం వరకూ ఉండే మజిల్‌ను లోయర్ బ్యాక్ అంటారు. ఈ ప్రాంతంలోని మజిల్‌ను తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ భాగానికి కఠినమైన వ్యాయామాలతో ప్రభాస్ లాంటి క్రిస్మస్ ట్రీ షేప్ పొందవచ్చు.
చాలా మంది అప్పర్ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, లోయర్ బాడీని నిర్లక్ష్యం చేస్తారు. అయితే పై భాగానికి మితిమీరి వర్కవుట్ ఇస్తున్నప్పుడు లోయర్ పార్ట్‌కి సమాంతరంగా ఇవ్వాలి. లేని పక్షంలో ఆ పార్ట్ సహజంగా ఉండాల్సిన ఫిట్‌నెస్‌ను సైతం కోల్పోతుంది. పైగా లోయర్ పార్ట్‌కి చేస్తేనే మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. లెగ్స్ స్ట్రెంగ్త్ లేకపోతే వెన్ను, మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందుకే రెగ్యులర్‌గా స్క్వాట్స్, లంజెస్, క్వార్డ్రయిసప్స్, కాఫ్ వంటివి చేయాలి.
‘వి’షేప్ సాధనలో భాగంగా చినప్స్ చాలా ముఖ్యం. ట్రిపిజల్స్, ట్రైసప్, లాట్స్, బ్యాక్ ప్రెస్, బెంచ్‌ప్రెస్... ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో చేయాలి. లేకపోతే చెక్కినట్టుండే రూపం సాధ్యం కాదు. పొట్ట ప్రాంతంలో కండరాల బలోపేతానికి అబ్డామినల్ వర్కవుట్స్, క్రంచెస్ బాగా చేయాలి. ఈ తరహా షేప్ కోసం కఠినమైన వ్యాయామాలు చేయాలి కాబట్టి, ముందుగా డాక్టర్ సలహా తీసుకుని ట్రైనర్ పర్యవేక్షణలో చేయాలి.