అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో గణేష్ మండప నిర్వాహకుల బహిరంగ సభ ఆదివారం కోలాహలంగా జరిగింది. అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సంరక్షకులు అశోక్‌సింఘాల్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అనంతరం వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందూత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు దుష్టశక్తులు చేస్తున్న కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూ జాతి పరిరక్షణ కోసం హిందూ ఫోర్స్ రూపొందాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కన్వీనర్ స్వామి కమలానంద భారతి మాట్లాడుతూ హిందువులు సభలు, సమావేశాలు జరుపుకొనేందుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది హిందువులు పాల్గొనే గణేష్ నిమజ్జనోత్సవం ప్రపంచంలోనే అరుదైన సామాజిక ఉత్సవమన్నారు. మాజీ ఎంపీ స్వామి చిన్మయానంద మాట్లాడుతూ అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా లక్ష శిబిరాలలో అయోధ్య మందిర పునర్నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ దేహానికి రోగం వస్తే మందులు బ్రతికిస్తాయని, దేశానికి జబ్బు పడితే గణపతి మాత్రమే రక్షించగలడన్నారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్. భగవంత్‌రావు మాట్లాడుతూ సీఎం సమక్షంలో గణపతి మండపాలకు అనుమతి అవసరం లేదని నిర్ణయించినప్పటికీ కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం అనుమతులు తప్పని సరి అని వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంఐఎంపై ఘాటు విమర్శలు చేశారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాతా నిర్మల యోగానంద భారతి, సత్యస్వరూపానందస్వామి, అవధూత రామకృష్ణానంద, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, గణేష్ ఉత్సవ సమితి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కార్పొరేటర్లు బంగారి ప్రకాష్, దేవర కరుణాకర్, సహదేవ్ యాదవ్, ఉదయ్ కుమార్, రాజాసింగ్‌లోథా, మెట్టు వైకుంఠం, ఆలె జితేంద్ర, కన్నె ఉమారమేష్ యాదవ్, గ్రేటర్ బీజేపీ నాయకులు గొడుగు శ్రీనివాస్ యాదవ్, తూముకుంట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతి రక్షణకు హిందూ ఫోర్స్ అవసరం
Published Mon, Sep 2 2013 1:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement