టైటిల్: రాఘవరెడ్డి
నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు
నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావ్, జీ.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి
సంగీతం: సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో
విడుదల తేది: జనవరి 5, 2024
కథేంటంటే..
రాఘవ రెడ్డి(శివ కంటంనేని) ఓ క్రిమినాలాజీ ప్రొఫెసర్. డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు క్రిమినల్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. రాఘవ రెడ్డి పాఠాలు చెప్పే కాలేజీ లోకి మహాలక్ష్మి అలియాస్ లక్కీ ( నందిని శ్వేత) స్టూడెంట్ గా వస్తుంది. లక్కీ చాలా అల్లరి అమ్మాయి. తన యాటిట్యూడ్ తో రాఘవరెడ్డి తో గొడవ పడుతుంది. కాలేజీ లో అంతా రాఘవ రెడ్డికి భయపడతారు కానీ లక్కీ మాత్రం రౌడీ బేబీ లా ప్రవర్తిస్తూ ప్రొఫెసర్ ని లెక్కచేయదు. ఒక సందర్భంలో రాఘవ రెడ్డికి లక్కీకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇదిలా ఉంటే...లక్కీ తల్లి దేవకీ(రాశి) ఒకసారి కాలేజీ కి వచ్చి వెళ్తుంటే...ఆమె వెనుక పరుగెత్తుతాడు రాఘవ. అసలు దేవకిని చూసి రాఘవ ఎందుకు పరుగెత్తాడు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ నీ కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? క్రిమినల్ కేసులను సాల్వ్ చేసే రాఘవ్.. కిడ్నాపర్ల ను ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
హీరో తన డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం..ఆపద వచ్చినప్పుడు మళ్లీ ఫ్యామిలీ కోసం పోరాటం చేసి రక్షించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. రాఘవరెడ్డి కథ కూడా ఇదే పంథాలో సాగుతుంది. డాటర్ సెంటిమెంట్‌తో ప్యామిలీ ఎమోషనల్‌గా ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. యూత్‌ను ఆకట్టుకోవడం కోసం కాలేజీ నేపథ్యాన్ని జోడించాడు. కథ పాతదే అయినా కాస్త కమర్శియల్ అంశాలను జోడించి కాస్త డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నప్పటికీ..తెరపై ఆకట్టుకునేలా తీయడంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకుంటే మెరుగైన ఫలితం ఉండేది.
ఫస్టాఫ్‌లో హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించాడు. కాలేజీ ప్రొఫెసర్‌గా ఉంటూనే.. క్రిమినల్ కేసులను పరిష్కరించడం. దోషులను గుర్తించే విధానాన్ని విశ్లేషించడం అన్ని ఆకట్టుకుంటాయి. ఇక నందిని శ్వేత పాత్ర ఎంట్రీ తర్వాత కథనం ఫన్ వేలో సాగుతుంది. కాలేజీలో ఆమె చేసే అల్లరి, శ్రీనివాస్ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి.
ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథను ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మలిచాడు. తన కూతురు ఎవరో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కిడ్నాపర్లను కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు. స్లో నెరేషన్.. సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
టైటిల్ పాత్ర పోషించిన శివ కంఠంనేని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లక్కీ పాత్రలో నందిని శ్వేత అదరగొట్టేసింది. ఇక చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన రాశి.. దేవకి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. బిత్తిరి సత్తి, శ్రినివాస్ రెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ విలనిజం పర్వాలేదు. అజయ్, ప్రవీణ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. బీజీఎం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment