ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసిన కేర్ టేకర్
పంజగుట్ట: ఓ ఉన్నతాధికారి వద్ద కేర్ టేకర్‌గా నమ్మకంగా ఉండే వ్యక్తి అతను మరణించిన అనంతరం కూడా చెక్కులపై ఫోర్జరీ సంతకాలు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నాడు. బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.నరేష్ రెడ్డి (28) వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే ఓ రిటైర్ ఉన్నతాధికారి ఎన్.వి. నాగేశ్వర్‌రావు వద్ద కేర్ టేకర్‌గా పనిచేసేవాడు. నాగేశ్వర్‌రావు గత ఏడాది అనారోగ్యంతో చనిపోయారు. నరేష్ రెడ్డి వద్ద నాగేశ్వర్‌రావుకు చెందిన వివిధ బ్యాంకుల చెక్కులు ఉన్నాయి. ఇటీవల వాటిపై సంతకం ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుంటున్నాడు.
నాగేశ్వర్‌రావు పింఛను డబ్బు సోమాజిగూడలోని సిండికేట్ బ్యాంకులో ఉండడంతో అతని కొడుకు వెంకటేశ్వర్‌రావు గత నెల 29వ తేదీన తన తండ్రి అకౌంట్‌కు సంబంధించి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. తండ్రి చనిపోయిన అనంతరం కూడా చెక్‌ద్వారా నగదు డ్రా చేసినట్లు అందులో ఉండడంతో బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 4వ తేదీన కూడా నరేష్ రెడ్డి మరో చెక్కుపై రూ.21,500 రాసుకుని ఫోర్జరీ సంతకంతో బ్యాంకుకు రాగా బ్యాంకువారు పట్టుకునేందుకు యత్నించారు. అక్కడ నుండి తప్పించుకోవడంతో సిండికేట్ బ్యాంకు ఛీఫ్ మేనేజర్ వీరారెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు.
ఇప్పటివరకు ఫోర్జరీ చెక్కులతో మొత్తం 5 లక్షల 39 వేలు డ్రా చేశారని, నాగేశ్వర్‌రావు మృతి చెందిన రోజు కూడా 40 వేలు డ్రాచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ రెడ్డిని నాగే శ్వర్‌రావు సొంత కొడుకులా చూసుకునేవారని, అతనికి ఏదైనా చేయాలని తపించేవారని త్వరలో వారు ప్రారంభించే ఓ సంస్థలో వాటా ఇచ్చేందుకు కూడా సిద్ధ్దమయ్యారని ఆయన బందువులు తెలిపారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.