నరేంద్రమోదీ ప్రధానిగా సాగిన రెండేళ్ల పాలన దేశంలోని మౌలిక రంగాల్లో వృద్ధిని సాధించడంలో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు విమర్శించారు.
హైదరాబాద్ : నరేంద్రమోదీ ప్రధానిగా సాగిన రెండేళ్ల పాలన దేశంలోని మౌలిక రంగాల్లో వృద్ధిని సాధించడంలో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు విమర్శించారు. వ్యవసాయం, పారిశ్రామికవృద్ధి, స్థూల జాతీయోత్పత్తి, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు తదితర రంగాల్లో గణాంకాలను పరిశీలిస్తే యూపీఏ పాలనలోని వృద్ధి కన్నా తక్కువ వృద్ధి కనబరుస్తున్నాయని కనుక మోదీ పాలన తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు.
నరేంద్ర మోదీ ప్రచార ఆర్భాటాలతో వాస్తవాలను ప్రజలకు చేరనీయకుండా మాటల గారడీ చేస్తున్నారని, ఏ రంగంలో చూసినా మోదీ పాలనలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. గురువారం ఇందిరాభవన్లో పీసీసీ నాయకులు, డా.శైలజానాథ్ సూర్యానాయక్, జంగా గౌతమ్, సుందర రామశర్మ, శాంతి భూషణ్లతో కలిసి విలేకరుల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు.
ఏపీకి సాయం చేయడంలో మోదీ రెండేళ్ల సాలన తీవ్ర నిరాశకు గురిచేసిందని, నిరాశ అనేదానికన్నా అన్యాయం, ద్రోహం చేసిందని చెప్పడం సబబుగా ఉంటుందని ఇంత అన్యాయాన్ని సీఎం చంద్రబాబు ఎలా భరిస్తున్నాడో అర్థం కావడం లేదని పళ్లంరాజు చెప్పారు.
జాతీయ అంశాలపై విశ్లేషిస్తూ మోదీ రెండేళ్ల పాలన విదేశాంగ వ్యవహారాల్లో, సరిహద్దు దేశాలలో సఖ్యత నెరపడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలో కరువును ఎదుర్కోవడంలో, రైతులకు అండగా నిలవడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో, మోదీ రెండేళ్ల పాలన విఫలమయిందని పళ్లంరాజు గణాంకాలతో వివరించారు.