ఆ జన్మాంతం తోడై వెళ్లాడు
భార్య చితిని చూస్తూనే కన్నుమూసిన భర్త
హైదరాబాద్: ఏడడుగులు నడిచి ఏడు జన్మలు తోడుంటానని తాళి కట్టే సమయంలో చేసుకున్న వాగ్ధానాన్ని నిజం చేస్తూ ప్రాణాలొదిలాడో వృద్ధుడు. బతికున్నంతకాలం ఎంతో అన్యోన్యంగా జీవించిన దంపతులు చావులోనూ వీడలేకపోయారు. భార్య మృతిని తట్టుకోలేక ఆమె చితి వద్దే ప్రాణాలొదిలాడు భ ర్త. ఆజన్మాంతం తోడున్నాను.. చావులోనూ నీతోనే ఉంటానంటూ తనువు చాలించాడు. ఈ సంఘటనను చూసిన కుటుంబ సభ్యుల, బంధువుల దుఃఖం కట్టలు తెంచుకుంది. తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా భార్యను కడసారి చూపు చూడాలనే ఆశతో శ్మశాన వాటికకు వెళ్లి చివరకు ఆమె చితి పక్కనే కన్ను మూయడం పలువుర్ని తీవ్రంగా కలచి వేసింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన గర్నెపల్లి నర్సింహ(80), మీనమ్మ(75) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సత్యనారాయణ, భిక్షపతి, వెంకటేష్ కుమార్, కూతురు భారతమ్మ ఉన్నారు. కాగా మీనమ్మ అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. బుధవారం కుటుంబ సభ్యులు మీనమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉప్పల్ నాలా వద్దగల శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. భర్త నర్సింహ తాను నడవలేని స్థితిలో ఉన్నా కూడా కడసారిగా తన భార్యను చూడాలని పట్టుబట్టడంతో అతడిని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.
అంత్యక్రియల్లో భాగంగా చిన్న కొడుకు వెంకటేష్ చితి చుట్టూ తిరిగి నిప్పు పెట్టేలోపు అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న నర్సింహ కూడా కన్నుమూశాడు. దీంతో హతాశులైన కుటుంబ సభ్యులు కాసేపటి తరువాత నర్సింహ మృతదేహానికి కూడా అక్కడే అంత్యక్రియలు చేశారు.
(ఉప్పల్)