ఓరుగల్లు బరిలో గద్దర్!
* ఉప ఎన్నికలో ప్రజాసంఘాల అభ్యర్థిగా రంగంలోకి..
* మద్దతు ప్రకటించే యోచనలో కాంగ్రెస్?
* టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికిదే మార్గమనే ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గజ్జె ఘల్లుమనిపించిన ప్రజాగాయకుడు గద్దర్‌ను వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రజాసంఘాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
గద్దర్ బరిలోకి దిగితే మద్దతు ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టవచ్చునని టీపీసీసీ కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ దాదాపు 2 దశాబ్దాలపాటు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు గద్దర్ నాయకత్వం వహించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఆ ఫ్రంట్‌కు దూరంగా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయినా గద్దర్ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు సుపరిచితునిగా ఉన్న గద్దర్‌ను వరంగల్ ఉప ఎన్నికలో బరిలోకి దింపితే గెలుపు సునాయాసమేననే విశ్వాసంతో ప్రజాసంఘాల నేతలున్నారు.
గద్దర్‌కు మద్దతుగా టీపీసీసీ..!
గద్దర్ వరంగల్ ఉప ఎన్నిక బరిలోకి దిగితే మద్దతు ప్రకటించాలనే యోచనలో టీపీసీసీ ముఖ్యనేతలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై ప్రజాసంఘాల నేతలతో కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఒక జాతీయ పార్టీగా ఎంపీ స్థానానికి తన అభ్యర్థిని పోటీలోకి దించకుండా ఉండటం సాధ్యమేనా, దీనికి అధిష్టానం అంగీకరిస్తుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉప ఎన్నికకు దూరంగా ఉంటే పార్టీ బలహీనంగా ఉందనే ప్రచారం వస్తుందని, దీనికి కాంగ్రెస్ వాదులు అంగీకరిస్తారా అనే అనుమానాలతో వారున్నారు. అయితే బలమైన అభ్యర్థి, ప్రజాదరణ ఉన్న అభ్యర్థికి కొరత ఉన్నప్పుడు తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌కు అండగా ఉంటూ టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పడమే మంచిదని అంటున్నారు.