రూ.100 కోట్లు.. 150 రోజులు
‘గాంధీ’ నిధుల ఖర్చుకు గడువు మార్చి 31
వినియోగించకపోతే మురిగి పోయినట్టే
అప్రమత్తమైన అధికారులు
నేడు విభాగాధిపతులతో సమావేశం
గాంధీ ఆస్పత్రి: రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించింది. సదరు నిధులను వచ్చే ఏడాది మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంది. లేకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉందని ఆస్పత్రి పాలనాయంత్రాంగం భావిస్తోంది. సదరు నిధులను ఖర్చు చేయడం సులభమే, కానీ ఆయా పనులను ఆస్పత్రి పాలనాయంత్రాంగం స్వయంగా చేపట్టే అవకాశం లేదు. తెలంగాణ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలోనే ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతిపాదనలు రూపొందించి మౌలిక సదుపాయాల సంస్థలకు అందిస్తే సదరు సంస్థ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించి పూర్తి చేయడం వంటి మూడు దశలు 150 రోజుల్లో సాధ్యపడుతుందా? అనే అనుమానం కలుగుతోంది.
ఇంకా నిలదొక్కుకోని కార్పొరేషన్..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి విడిపోయి పూర్తిస్థాయి సాధనాసంపత్తిని సమకూర్చుకోలేదని, దీంతో టెండర్లు. ఇతర ప్రక్రియల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని పలువురు అధికారులు భావిస్తున్నారు.
అప్రమత్తమైన పాలనా యంత్రాంగం...
ఆస్పత్రుల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యను కలిశారు. మార్చి 31వ తేదీలోగా నిధులు ఖర్చు చేయకపోతే మురిగిపోయే ప్రమాదముందని ఆ మంత్రి హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు గాంధీ పాలనయంత్రాంగం కసరత్తు చేస్తోంది.
నేడు గాంధీ హెచ్‌ఓడీల సమావేశం..
గాంధీ ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలతో ఆస్పత్రి పాలనాయంత్రాంగం శనివారం సమావేశం నిర్వహించనుంది. రూ.176 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, బడ్జెట్‌లో వంద కోట్లే కేటాయించడంతో ప్రాధాన్యతల ప్రకారం మరోమారు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఆయా విభాగాల్లో అత్యవసరమైన వైద్యపరికరాలు, అభివృద్ధి వంటి అంశాలపై చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఆస్పత్రి సెనినార్ హాలులో హెచ్‌ఓడీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు.