గణేష్ నిమజ్జనం : అప్ డేట్స్ | Ganesh immersion in Hyderabad | Sakshi
Sakshi News home page

గణేష్ నిమజ్జనం : అప్ డేట్స్

Published Wed, Sep 6 2017 12:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

Ganesh immersion in Hyderabad

సాక్షి, హైదరాబాద్ : బొజ్జగణపయ్య నిమజ్జన పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. జై భోలో గణేష్ మహరాజ్ కీ... జై అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. బాలాపూర్‌ శోభా యాత్ర మంగళవారం రాత్రి 9గంటలకు పాత బస్తీ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ హుస్సేన్‌ సాగర్‌లో వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది.

నగరం నలుమూలల నుంచి నడిబొడ్డులోని హుస్సేన్ సాగర్‌కు గణనాధుల వాహన శ్రేణులు మంగళవారం రాత్రి దాటిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి.  మంగళవారం తెల్లవారుజాము నుంచే గణనాధుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎటుచూసినా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అశేషమైన భక్తజన సందోహం నడుమ మంగళవారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌లోని క్రేన్‌ నం-4వద్ద ఖైరతాబాద్‌ మహా వినాయకుడు, క్రేన్‌ నం-8 వద్ద సాయంత్రం బాలాపూర్‌ గణేష్‌ గంగమ్మ ఒడికి చేరారు. పూర్తి అప్‌డేట్స్‌ ఇవి..

మధ్యాహ్నం 1.45 గంటలకు.. మహా గణపతి నిమజ్జనం పూర్తి
ముందుగా అనుకున్నట్లే మధ్యాహ్నం 12 గంటల కల్లా గణనాథుని నిమజ్జనం పూర్తవుతుందని భావించినా... మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో మహా గణపతి గంగమ్మ ఒడిలో చేరాడు. మరోవైపు నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు.


సాయంత్రం 6.12 గంటలు..క్రేజ్‌ నం-8 వద్ద బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం
7 గంటల పాటు సాగిన బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
పీపుల్స్‌ ప్లాజా వద్ద సెల్ఫీ తీసుకుంటూ నీటిలో పడ్డ యువకుడు
యువకుడి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు
♦ సాయంత్రం 5.29 గంటలు..నిమజ్జనం ప్రాంతాల్లో హెలికాప‍్టర్‌ ద్వారా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి ఏరియల్‌ సర్వే
♦ సాయంత్రం 5.21 గంటలు.. ట్యాంక్‌ బండ్‌కు చేరుకున్న బాలాపూర్‌ వినాయకుడు
♦ సాయంత్రం 5.15 గంటలు.. ఇప్పటివరకూ 664 విగ్రహాలు నిమజ్జనం
♦ సాయంత్రం 4.52 గంటలు.. వినాయక విగ్రహాల నిమజ్జనానికి నృత్యాలు, కోలాటాలతో ట్యాంక్‌ బండ్‌కు తరలి వస్తున్న భక్తులు
మధ్యాహ్నం 3.51 గంటలు చార్మినార్‌ లో శోభాయాత్రను పరిశీలించిన డీజీపీ అనురాగ్‌ శర్మ, సీపీ మహేందర్‌ రెడ్డి
నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, అందరు సహకరించాలి: డీజీపీ, సీపీ
మధ్యాహ్నం 3.49 గంటలు రూ.3.66 లక్షలు పలికిన కూకట్‌పల్లి గణేష్‌ లడ్డు
లడ్డును దక్కించుకున్న బీజేపీన నేత నరేందర్‌
మధ్యాహ్నం 03.15 గంటలు చార్మినార్‌ దాటిన బాలాపూర్‌ గణేషుడు
మధ్యాహ్నం 01.50 గంటలు  మూసాపేటలో నిమజ్జనానికి బయల్దేరిన 30 అడుగుల మట్టి గణపతి
మధ్యాహ్నం 01.49 గంటలు చార్మినార్‌ వద్దకు చేరిన శోభాయాత్ర
మధ్యాహ్నం 01.48 గంటలు పాతబస్తీలోకి ప్రవేశించిన బాలాపూర్‌ వినాయకుడు
మధ్యాహ్నం 01.47 గంటలు చార్మినార్‌ చేరుకున్న అలియాబాద్‌ గణేషుడు
మధ్యాహ్నం 01.40 గంటలు  ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం.. క్రేన్‌-4 వద్ద ఏర్పాట్లు
మధ్యాహ్నం 01.45 గంటలు ఖైరతాబాద్‌ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తి

 

ప్రారంభమైన శోభాయాత్ర..

♦  ఉదయం 04.30 గంటలు బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది..

♦  ఉదయం 05:00 గంటలు ఖైరతాబాద్‌ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.

♦  ఉదయం 08:00 గంటలు  మండపం నుంచి బయల్దేరిన ఖైరతాబాద్‌ వినాయకుడి ఊరేగింపు ప్రస్తుతం లక్డీకపూల్‌కు వెళ్లే దారి వద్దకు చేరుకుంది.

♦  ఉదయం 08:30 గంటలు ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావడం జనసందోహం కొంచెం తక్కువగా ఉంది. దీంతో గణేశుడి విగ్రహాల ఊరేగింపు కూడా వేగంగా జరుగుతోంది. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణేశుల నిమజ్జనం కూడా అనుకున్న సమయాని కంటే ముందే జరగొచ్చని భావిస్తున్నారు.

♦  ఉదయం 09:00 గంటలు  ఖైరతాబాద్‌ గణేశుడి ఊరేగింపు ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్దకు చేరుకుంది. తెలుగు తల్లి ఫై ఓవర్‌ పక్క నుంచి నక్లెస్‌ రోడ్‌ వద్దకు ఊరేగింపు వెళ్లనుంది.

♦  ఉదయం 09.12 గంటలు బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర పూర్తి. లడ్డూ వేలం పాటకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు. ఇప్పటివరకూ లడ్డూలు గెల్చుకున్న 17 మందితో పాటు కొత్తగా మరో నలుగురికి వేలం పాటలో అవకాశం.

ఉదయం 09.28 గంటలు సెక్రటరియేట్‌ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్‌ అనంత మహాగణపతి

ఉదయం 10.03 గంటలు ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట.

ఉదయం 10.04 గంటలు బాలాపూర్‌ లడ్డూ దేవుడి పాట 1,116/-

ఉదయం 10.06 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.8 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.07 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.10 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.08 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.14.25 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.08 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.14.60 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.08 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.14.95 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.08 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.15.05 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.09 గంటలు బాలాపూర్‌ లడ్డూ రూ.15.50 లక్షలకు చేరుకున్న వేలం.

ఉదయం 10.09 గంటలు బాలాపూర్‌ లడ్డూను రూ.15.60 లక్షలకు వేలంలో దక్కించుకున్న నాగం తిరుపతి రెడ్డి.

ఉదయం 10.52గంటలు ట్యాంక్‌ బండ్‌ చేరుకున్న ఖైరతాబాద్‌ గణేశుడు.

ఉదయం 11.37గంటలు కాసేపట్లో నాలుగో క్రేన్‌ వద్ద అనంత చండీ మహా గణపతి విగ్రహ నిమజ్జనం. క్రేన్‌ను నిమజ్జనానికి సిద్ధం చేసిన అధికారులు.

నగరమంతా కోలాహలం...
ఇప్పటికే మూడు, ఐదు, ఏడు రోజుల పూజలందుకున్న వినాయకుల నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి మహానగర వ్యాప్తంగా సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ సహా గ్రేటర్‌ నలుమూలలా ఏర్పాటుచేసిన 23 నిమజ్జన కొలనుల్లో పదివేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అంచనావేస్తున్నారు.

మహానిమజ్జనానికి ఏర్పాట్లు
♦  జీహెచ్‌ఎంసీ, పోలీసు, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్‌, వైద్య, ఆరోగ్యశాఖ, రవాణా, ఆర్టీసీ, రైల్వే, తదితర విభాగాలన్నీ రంగంలోకి దిగాయి.
♦  సామూహిక నిమజ్జన వేడుకలు జరుగనున్న ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా భారీ క్రేన్‌లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌ వైపు 18 క్రేన్‌లు, నెక్లెస్‌రోడ్డు వైపు 9 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు.
♦  బాలాపూర్‌ విగ్రహంతో బయలుదేరిన తరువాత ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహాన్ని సైతం ఈ సారి ఉదయమే నిమజ్జనానికి తరలించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ రెండు విగ్రహాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ ట్యాంక్‌బండ్‌ వద్ద కలుస్తాయి.
♦  ఉదయం నుంచే విగ్రహాలు తరలిరానున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు.
♦  నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు.
గడిచిన మూడు రోజులుగా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో మంగళవారం సుమారు 10 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్లు అంచనా.

జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు.....
♦  నిమ‌జ్జన శోభ‌యాత్ర జ‌రిగే మార్గంలో రోడ్ల మ‌ర‌మ్మతులు, అద‌న‌పు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
♦  హుస్సేన్‌సాగ‌ర్ వ‌ద్ద గ‌ణేష్ విగ్రహాల‌ నిమ‌జ్జనం సాఫీగా సాగేందుకు ఫ్లాట్‌ఫాంలను సిద్ధం చేశారు.
♦  పారిశుధ్య ఏర్పాట్లులో భాగంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్‌లలో పురుషుల‌కు 20 తాత్కాలిక మూత్రశాల‌లు, మ‌రుగుదొడ్లు, మ‌హిళ‌లకు 10 టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
♦  101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను వాటర్‌వర్క్స్‌ విభాగం సిద్ధం చేశారు.
♦  శోభాయాత్ర జరిగే మార్గంలో ప్రతి 3–4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 165 గణేష్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒక శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ జవాన్, 21 మంది వర్కర్లు మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
♦  శోభాయాత్ర జరిగే ప్రధాన వీధుల్లో 354 కిలోమీటర్ల మేర ఈ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. గణేష్‌ యాక్షన్‌ టీమ్‌లలో మొత్తంగా పదివేల మంది సభ్యులుంటారని తెలిపింది.
♦  నిమజ్జనం కోసం 236 వివిధ రకాల వాహనాలను వినియోగించనుంది. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ గణనాథుల నిమజ్జనానికి 27 భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది.
♦  అనేక చోట్ల అదనంగా వీధి లైట్ల ఏర్పాటు.
♦  నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక గజ ఈతగాళ్లను నియమించారు.
♦  గణేష్‌ నిమజ్జనం పూర్తయిన వెంటనే 14 స్వీపింగ్‌ మిషన్ల  పరిశుభ్రత పనులు.

నిమజ్జనం జరిగే ప్రాంతాలు
1. కాప్రాచెరువు, 2. సరూర్‌నగర్‌, 3. రాజన్నబావి, 4. మీరాలంట్యాంక్‌, 5. పల్లెచెర్వు, 6. పత్తికుంట చెరువు, 7. దుర్గం చెరువు, 8. మల్కం చెరువు,  
9. గోపీనగర్‌ చెరువు, 10. పెద్దచెరువు, 12. గురునాథం చెరువు, 13. కాయిదమ్మకుంట, 14. ఈర్లచెరువు, 15. రాయసముద్రం చెరువు, 16. సాకిచెరువు,
17. ఐడీఎల్‌ ట్యాంక్‌, 18. ప్రగతినగర్‌ చెరువు, 19. హస్మత్‌పేట్‌ చెరువు, 20. సున్నం చెరువు, 21. పరికి చెరువు, 22. వెన్నెలగడ్డ చెరువు, 23. సూరారం చెరువు,

హుస్సేన్ సాగర్ వ‌ద్ద....
♦  ప్రతి మూడు, నాలుగు కిలోమీట‌ర్లకు ఒక గ‌ణేష్ యాక్షన్‌ టీమ్‌ల ఏర్పాటు.
♦  ప్రతి యాక్షన్‌ టీమ్‌లో ఒక శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21మంది పారిశుధ్య సిబ్బంది ఉంటారు.
♦  మొత్తం 388.5కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో 165 గ‌ణేష్ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
♦  295మంది శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు, జ‌వాన్లు, 688 మంది ఎస్ఎఫ్ఎలు, 9,710మంది పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక నియామ‌కం.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద 85 మంది స్విమ్మర్లు, డైవ‌ర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్‌ వ‌ద్ద ఇద్దరు స్విమ్మర్లు ఉంటారు.
♦  చెరువుల వ‌ద్ద వెయ్యి మంది ఎంట‌మాల‌జి వ‌ర్కర్లు నియామ‌కం.
♦  రూ. 1.05కోట్ల వ్యయంతో 236 వాహ‌నాల ఏర్పాటు.

ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు...
♦  నిమ‌జ్జన సంద‌ర్భంగా ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
♦  నిమజ్జనం సందర్భంగా ప్రజలు తమ సమస్యలను చెప్పడానికి ప్రత్యేకంగా డ‌య‌ల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంట‌ర్ నెంబర్‌ 040-21111111 ల‌కు సంప్రదించవచ్చు. అలాగే ‘ మై జీహెచ్ఎంసి’ యాప్ ద్వారా సమస్యలను అధికారులకు వివరించవచ్చు.
♦  ప్రతి మూడు క్రేన్‌ల వ‌ద్ద షిఫ్టుల వారీగా ప‌నిచేయ‌డానికి 231 మంది ఎంట‌మాలజి సిబ్బందిని నియమించారు.
♦  నిమ‌జ్జనం సంద‌ర్భంగా వెలువ‌డే వ్యర్థాల తొల‌గింపునకు 25ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల 6 వాహ‌నాలను సిద్ధం చేశారు.
♦  మరో 40 మినీ టిప్పర్లు, 6 ఫ్రంట్ ఎండ్ లోడ‌ర్లు, 4జె.సి.బిలు, 6 బాబ్‌కాట్‌లు, 20 స్మాల్ స్వీపింగ్ మిష‌న్లు, 6 బిగ్ స్వీపింగ్ మిష‌న్లను సిద్ధంగా ఉంచారు.

జలాశయాల్లో కలిసే వ్యర్థాలు....
♦  నిమజ్జనం సమయంలో హుస్సేన్‌సాగర్‌ సహా ఆయా నిమజ్జన కొలనుల్లో కలిసే రసాయన రంగుల అవశేషాలు : లెడ్‌ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్‌ ఆక్సైడ్, రెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్, రెడ్‌ లెడ్, క్రోమ్‌ గ్రీన్, పైన్‌ ఆయిల్, లిన్సీడ్‌ ఆయిల్, లెడ్‌ అసిటేట్, వైట్‌ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్‌.
♦  హానికారక మూలకాలివే : కోబాల్ట్, మ్యాంగనీస్‌ డయాక్సైడ్, మ్యాంగనీస్‌ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్‌ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్‌ ఆర్సినిక్, జింక్‌ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.

పర్యావరణ హిత నిమజ్జనానికి సూచనలు...
♦  జలాశయంలో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి.  
♦  మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు.
♦  వినాయక విగ్రహాలతోపాటు జలాశయాలంలోకి ఆకులు, పూలు, కొబ్బరికాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్‌ కవర్లను వేయొద్దు.
♦  ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి.

వ్యర్థాల తొలగింపునకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు...
♦  హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి జీహెచ్‌ఎంసీ డంప్‌యార్డుకు తరలించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లుచేసింది. ఈ కృషిలో మూడు జేసీబీలు, 6 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇక వ్యర్థాల తొలగింపు పనుల్లో 480 మంది కూలీల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది.

ఎమర్జన్సీ టీంలు : సీసీ కెమరాలతో పర్యవేక్షణ
♦  24 గంటలపాటు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సర్కిల్‌లో ఒక ఎమర్జెన్సీ టీం ఏర్పాటు
♦  బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 800 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
♦  ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేష్‌ యాక్షన్‌ టీం, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు ఎలక్ట్రిషన్‌లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉంటారు.
♦  సుమారు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు చేశామని, 310 అత్యంత సున్నిత, మరో 605 సున్నిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.
♦  410 మొబైల్‌ పోలీసు బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి.
♦  నిమజ్జనం కోసం ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్‌ వద్ద 25, మినిస్టర్‌ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్‌లో 2, ఎర్రకుంటలో 2 క్రేన్‌లను సిద్దం చశారు.
♦  అనేకచోట్ల అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్యబందాలు, మెకానిక్‌ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
♦  నిమజ్జనం జరిగే మార్గాలలో 117 పాయింట్లను గుర్తించి దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు పనులను చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
♦  భక్తులకోసం ఆర్టీసి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 16 మార్గాల గుండా ట్యాంక్‌బండ్‌కు 500 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement