
బాలికను వ్యభిచార గృహానికి తరలిస్తూ..
బాలికను వ్యభిచార గృహానికి తరలిస్తుండగా మహారాష్ట్ర పోలీసులు రక్షించారు. అక్కడి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు బాలికను నగరానికి తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై రాము తెలిపిన వివరాలు.. సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన 16 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలతో నిత్యం గొడవ పడేవారు. ఇది గమనించిన స్థానిక మహిళ ఆ బాలికను చేరదీసి పని ఇప్పిస్తానని బంజారాహిల్స్‌లోని నిషా అనే మహిళకు అప్పగించింది. ఆమె బాలికను వ్యభిచారం చేయమని బలవంతం చేయడంతో అందుకు బాలిక నిరాకరించింది.
దీంతో ఈ నెల 21న నిషా ఆమె ఇద్దరు కుమారులు,మరో ఇద్దరు బంధువులు కలిసి బాలికను ముంబాయి తరలించారు.అక్కడినుంచి పుణెకు వచ్చి వ్యభిచార గృహం నిర్వాహకురాలు అంజుతాప అనే వ్యక్తికి విక్రయించే ప్రయత్నం చేశారు. మైనర్ కావడంతో అందుకు ఆమె నిరాకరించి సమీపంలోని పరిస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి నిషాతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. బాలికను రిస్క్యూ హోమ్‌కు తరలించి సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి బాలికను నగరానికి తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.కేసుదర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.