Woman trafficking
-
ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్
విశాఖపట్నం: అమాయకులైన యువతులను ఉద్యోగాల పేరుతో దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 12 మందిని చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ బ్రోకర్ దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ వారిని దుబాయ్ షేక్‌లకు అమ్మేశాడు. ఆ దుబాయ్ షేక్‌లు తమను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారని, బంగారం స్మగ్లింగ్ చేయాలని బెదిరిస్తున్నారని, తమను రక్షించాలంటూ బాధితులు తమ కుటుంబీకులు, బంధువులకు వీడియో కాల్ చేస్తున్నారు. దీనిపై బాధితుల తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్రోకర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
జూనియర్ ఆర్టిస్టుల పేరుతో 95 మంది దుబాయ్‌కి.. తీరా అక్కడకు వెళ్తే..
బెంగళూరు: విదేశాల్లో అధిక వేతనంతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 7 మందితో కూడిన అక్రమ ముఠాను అరెస్ట్ చేశారు. కొప్పళ కంప్లివాసి బసవరాజశంకరప్ప కళసద్, మైసూరు నజరాబాద్ ఆదర్శ అలియాస్ ఆది, తమిళనాడు సేలం రాజేంద్రనాచి ముత్తు, చెన్నై మారియప్పన్, పాండిచ్చేరి అశోక్, తిరువళ్లువర్ రాజీవ్, జేపీనగర చందు నిందితులని నగర జాయింట్ పోలీస్‌కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 95 మంది మహిళలను జూనియర్ ఆర్టిస్టుల పేరుతో పాస్‌పోర్టులు తయారుచేయించి దుబాయ్‌కి పంపించారు. అక్కడ యజమానులు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో గాలింపు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 17 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమించిన అత్త కూతురు కోసం దొంగతనానికి పాల్పడి..) -
Odisha: బాలికల అక్రమ రవాణా
మల్కాన్‌గిరి: భైరపుట్ మండలం కుడుములుగుమ్మ గ్రామానికి చెందిన బాలికలను అక్రమంగా తరలిస్తున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు మాదిరిగానే తహసీల్దారు విజయ్ మండాంగి గ్రామంలో తనిఖీ చేస్తుండగా, ఓ వాహనంలో కూర్చున్న ఐదుగురు బాలికలను గమనించారు. ఎక్కడికి వెళుతున్నారని అడిగినా బాలికలు జవాబివ్వక పోవడంతో చైల్డ్‌లైన్ సిబ్బందిని పిలిపించారు. వీరిని వలసకూలీలుగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బాలికలను మాల్కాన్గిరి శిశుసంక్షేమ కేంద్రంలో ఉంచారు. దర్యాప్తు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు చైల్డ్‌లైన్ సిబ్బంది తెలిపారు. చదవండి: Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి -
ఆడపిల్ల ఏమాయనో!
పశ్చిమగోదావరి, దెందులూరు: బాలికలు, మహిళల అదృశ్యం కేసులు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆచూకీ కానరాని కేసులు భారీగా ఉన్నాయి. ఇది సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. రెండేళ్లల్లో ఏకంగా 932 మంది జిల్లాలో అదృశ్యం కాగా, అందులో 107 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఉన్నారో లేరో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. అధికశాతం ‘ప్రేమ’ అదృశ్యాలే ఇదిలా ఉంటే అధికశాతం అదృశ్య కేసులు ప్రేమ వ్యవహారాల వల్లే జరుగుతున్నట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. శాస్త్ర సాంకేతికాభివృద్ధితోసెల్ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతమై పెడధోరణులు పెరుగుతున్నాయని, బాలికలు, యువతులు మాయగాళ్లు చెప్పే మాటలకు ఆకర్షితులై ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. అదృశ్యమైన కేసుల్లో 80 శాతం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదిస్తున్నామని, అయినా 20 శాతం అదృశ్యం కేసులు అంతుచిక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. కొన్ని అదృశ్యం కేసులు మానభంగాలు, హత్యలుగా వెలుగు చూస్తున్నాయి. పెద్దలపై కోపంతో కూడా చాలామంది బాలికలు ఇళ్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు జరుగుతున్నట్టు సమాచారం. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు యువతుల అదృశ్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుస్తున్నాయి. కుటుంబ కలహాల వల్ల చాలామంది ఇళ్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లయిన యువతులు అదృశ్యమైనప్పుడు పిల్లలు బలి అవుతున్నారు. అదృశ్యమైన వారిలో చదువుకున్న వారు, ఉద్యోగులూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పేరిట మోసాలే ఎక్కువ అదృశ్యమైన బాలికలు, యువతుల్లో 80 శాతం మంది ప్రేమ పేరిట మోసాలకు గురవుతున్నారు. అదృశ్య ఫిర్యా దులను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం.యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు బదిలీ చేస్తున్నాం. సీసీటీఎన్ఎస్(క్రైం అండ్ క్రిమి నల్ ట్రాకింగ్ నెట్వర్క్) ద్వారా ఆ యువతుల కదలికల సమాచారాన్ని పసిగడుతున్నాం. గత రెండేళ్లల్లో సమష్టి కృషితో అదృశ్యమైన వారిలో 80 శాతం మందిని కనుగొన్నాం. ఎం.రవిప్రకాష్, ఎస్పీ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ పీజీ, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి మోసం, బాలికలు, యువతుల అక్రమ రవాణా, ప్రలోభాలు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. రెండు నెలలపాటు జిల్లా అంతటా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం.– కె.విజయకుమారి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ మానసిక ఉపాధ్యాయులు అవసరం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక ఉపాధ్యా యులను నియమించాలి. హాస్టళ్లు, శిక్షణ కేంద్రాల్లోనూ కౌన్సెలింగ్ ఇప్పించాలి. –కె.హనుమంతు, స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్, గోపన్నపాలెం -
రషీద్..అను నేను..!
సాక్షి, సిటీబ్యూరో: 2007 ఏప్రిల్‌లో అప్పటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీలో అరెస్టుతో దొరికిన మనుషుల అక్రమ రవాణా తీగను లాగితే రాష్ట్రంలో డొంక కదిలింది.. దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్‌లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది... అతడి కోసం ïనగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులతో పాటు రాష్ట్రంలోని అన్ని నిఘా, పోలీసు విభాగాలు గాలింపు ప్రారంభించాయి... మోస్ట్ వాంటెడ్‌గా మారిన రషీద్ తనంతట తానుగా లొంగిపోవడానికి సీసీఎస్ మెట్లు ఎక్కాడు... అక్కడి పోలీసులు అతడిని దాదాపు గెంటేసినంత పని చేశారు...ఇదే రషీద్ ‘ఐటీ నోటీసులు చూపించి లూఠీ చేసిన కేసులో’ సీసీఎస్ పోలీసులు రెండోసారి బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అప్పట్లో అలా ఎందుకు జరిగింది? స్కామ్ వివరాలు ఇలా ఉన్నాయి.. వారికి అనుమతి లేనందునే... టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి అక్రమంగా స్థిరపడిపోతున్న నేపథ్యంలో అమెరికా, లండన్ తదితర దేశాలు గుజరాత్‌కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రమే వీటిని జారీ చేసేవారు. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది. గుజరాత్‌కు చెందిన వారిని ఎంపీలు, ఎమ్మెల్యేల సంబంధీకులుగా చూపిస్తూ నకిలీ పాస్పోర్ట్స్ తయారు చేయడ,ం వారి సిఫార్సుతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేయడం మొదలైంది. నగరంలోని చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రషీద్ అలీ, చెప్పల్‌బజార్ వాసి రాజుపిట్టి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీగా పని చేస్తున్న రాజు రషీద్‌కు అవసరమైన సొమ్ము వడ్డీకి ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని పిట్టికి చెప్పడంతో అతను గుజరాత్‌లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన భరత్భాయ్ని కలుసుకున్నాడు. అనంతరం వారితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. బాబుభాయ్ అరెస్టుతో ప్రకంపనలు... ఈ ద్వయం అనేక మంది గుజరాతీయులను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పించే వారు. ఇందుకుగాను సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబర్‌లో రషీద్ నుంచి రాజుపిట్టికి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బోథ్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టుతో సంచలనం రేపింది. సిటీ సీసీఎస్లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు సిటీ పోలీసులకు రషీద్ మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్‌భాయ్, షకీల్‌ల కోసం వేట ప్రారంభమైంది. మీడియా హడావుడి నేపథ్యంలో... సిటీ సీసీఎస్‌లో మనుషుల అక్రమ రవాణా కేసు నమోదైన రోజు నుంచి ఆ కార్యాలయం హడావుడిగా మారిపోయింది. మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. ఓ పక్క రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. 2007 మే 3న తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి రషీద్ నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెంట్రీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్‌ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా నెట్టేసినంత పని చేశాడు. ఆయన పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్న రషీద్ వచ్చాడంటూ కేసు దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు రషీద్‌ను తమవెంట తీసుకువెళ్లి విచారణ, అరెస్టు పూర్తి చేశారు. -
ఖరీదైన జీవితం అంటూ కళాశాల విద్యార్థినులను..
సాక్షి ప్రతినిధి, చెన్నై: యువతుల్లోని అమాయకత్వం వారికి అవకాశం. వారి పేదరికమే వీరి దురాగతాలకు పెట్టుబడి. కావాల్సినంత ధనం, ఖరీదైన జీవితం అంటూ కళాశాల విద్యార్థినులను, యువతులను వ్యభిచార కూపంలోకి దింపే ముఠా ఆగడాలను అరికట్టండి అంటూ కుమార్తెను దూరం చేసుకున్న ఓ బాధిత తల్లి కన్యాకుమారి జిల్లా ఎస్పీకి ఆధారాలు సహా శుక్రవారం ఫిర్యాదు చేసింది. ముఠా చేతిలో చిక్కుకున్న కుమార్తెను రక్షించి అప్పగించాలని శుక్రవారం తన బంధువులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదువు పూర్తికావడంతో పెళ్లి చేయాలని భావించాం. పెద్దల అభీష్టం ప్రకారం పెళ్లిచేసుకునేందుకు కుమార్తె అంగీకరించడంతో ఒక యువకుడితో నిశ్చితార్థం చేశాను. నిశ్చితార్థం సమయంలో సహజంగానే ప్రవర్తించిన కుమార్తె...వివాహవేడుక రోజు సమీపిస్తుండగా అకస్మాత్తుగా మాయమైంది. తమ బంధువు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లగా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు, ఇంటికి వచ్చేందుకు నిరాకరించింది. నీ కుమార్తె ఇక ఇంటికి రాదు, ఆమెతో మాకు పని ఉంది. పదేపదే వస్తే చంపేస్తామని నన్ను బెది రించారు. ఈ విషయంపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, మీ కుమార్తె మేజర్, ఆమెఇష్టప్రకారం నడుచుకునే హక్కుంది అన్నారు. కుమార్తె చేష్టలకు అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్ తీసి పరిశీలించగా అందులో కుమార్తెతో కూడిన అనేక అశ్లీల విడియో దృశ్యాలు ఉన్నాయి. ఏ తల్లీ చూడలేని దృశ్యాలను చూడాల్సి వచ్చింది. నా కూతురే కాదు, ఇంకా ఎందరో యువతుల అశ్లీల దృశ్యాలు, ఫొటోలు ఉన్నాయి. పేదరికాన్ని అవకాశంగా తీసుకుని యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి జీవితాలను నాశనం చేస్తున్నారనేందుకు నా కుమార్తె సెల్‌ఫోన్‌లోని దృశ్యాలే సాక్ష్యం. ముఠా చేతుల్లో నుంచి నాకుమార్తెను రక్షించి అప్పగించండి. ఇతర యువతులకు విముక్తి కల్పించి కిరాతకులను చట్టపరంగా శిక్షించండని ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే ఆధారాలను అప్పగించారు. ఈ ఫిర్యాదును అన్ని మహిళా పోలీస్స్టేషన్లకు పంపి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్స్పెక్టర్ శాంతకుమారిని ఎస్పీ ఆదేశించారు. కొట్టరై అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఉన్న ఒక ముఠా కళాశాల విద్యార్థినులు, యువతులపై వలవేస్తోందని, చేతినిండా డబ్బు, ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన జీవితం అంటూ ఆశచూపి లొంగదీసుకుంటోందని ఆమె మీడియా ముందు వాపోయారు.ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని తల్లిదండ్రులకు చెప్పి బంగ్లాకు రా, అక్కడ మరెవరూ ఉండరు, ఒక్క గంట గడిపితే చాలు అంటూ సెల్‌ఫోన్‌లోని సంభాషణలను ఆమె వినిపించారు. ఇది పథకం ప్రకారం సాగుతున్న దురాగతమని ఆమె అన్నారు. కిందిస్థాయి పోలీసులు సహకరించలేదు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. -
ఆ దేశం బిడ్డలు.. అంగడి బొమ్మలు
పేదరికంలో మగ్గుతున్న బంగ్లాదేశీయులు తమఉపాధికి ఆశాకిరణంగా భారత్‌ను భావిస్తున్నారు. ఇక్కడికి వస్తే తమ కుటుంబానికి బతుకుదెరువు దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు అక్రమార్కుల చేతిలో పడి మోసపోతున్నారు. ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా అవుతున్న మహిళలు, యువతులు హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్టు తేలింది. ఈ అంశంలో ముంబై తర్వాతి స్థానం నగరానిదే కావడం గమనార్హం. ‘హ్యూమన్ ట్రాఫికింగ్: మోడెస్ ఆపరెండీ ఆఫ్ టాట్స్ ఆన్ ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్’ పేరుతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. నగరానికి వస్తున్న వారికి శివార్లలోని పారిశ్రామిక వాడలు, మసాజ్ పార్లర్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మరోపక్క కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ముఠాలు బంగ్లా యువతులను ప్రధానంగా వ్యభిచార కేంద్రాలకు విక్రయిస్తున్నాయి. డ్యాన్స్ బార్లు, మసాజ్ పార్లర్లు, ఇళ్లల్లో పనిమనుషులు గాను వారిని మార్చేస్తున్నాయి. అక్రమ రవాణా బాధితుల్లో అనేకమంది బానిస కూలీలుగానూ బతుకుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి రవాణా అవుతున్న బాధితుల పరిస్థితిపై బీఎస్ఎఫ్ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో అనేక ఎన్జీఓల సహకారం తీసుకుంది. ఈ అధ్యయనం ఆధారంగా ‘హ్యూమన్ ట్రాఫికింగ్: మోడెస్ ఆపరెండీ ఆఫ్ టాట్స్ ఆన్ ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్’ నివేదికను రూపొందించింది. ఈ ట్రాఫికింగ్, హైదరాబాద్‌లో తిష్టవేస్తున్న అక్రమ బంగ్లాదేశీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ పోలీసు విభాగాన్ని హెచ్చరించింది. అక్కడ ఢాకా.. ఇక్కడ కోల్‌కతా.. బీఎస్ఎఫ్ నివేదిక ప్రకారం ఏటా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి కనీసం 50 వేల మంది బాలికలు, యువతులు అక్రమంగా రవాణా అవుతున్నారు. వీరిలో ప్రధానంగా 12 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. భారత్–బంగ్లా సరిహద్దుల్లో మాటు వేసిన కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నాయి. ఇవన్నీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తూ ఇందుకు కోల్‌కతాను ప్రధాన కేంద్రంగా వినియోగించుకుంటున్నాయి. బంగ్లాదేశీ యువతులు, మహిళలను తొలుత అక్కడికి రప్పించి ఆపై దేశంలోని అనేక నగరాలకు రవాణా చేస్తున్నాయి. దళారుల్లో మహిళలూ ఉన్నారు.. ఢాకా మొదలు భారత్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల వరకు అనేక మంది దళారులు ఓ సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ రవాణా దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో దళారులుగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశీయుల్లో 84 శాతం పురుషులు ఉండగా 16 శాతం మహిళలు ఉంటున్నారు. బంగ్లాదేశీయులను ట్రాప్ చేయడానికి ఈ దళారులు అనేక రకాలుగా ఎర వేస్తున్నారు. భారత్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయని, ఇంటి పనులు చేసే వారికి డిమాండ్ ఉందని చెబుతున్నాయి. కాస్త ఆకర్షణీయంగా ఉన్న యువతులకు సినిమాల్లో అవకాశాలు, ప్రేమ–పెళ్లి పేరుతో సరిహద్దులు దాటేలా కథ నడిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రామాల్లోని నిరుపేదలే వీరికి టార్గెట్‌గా మారుతున్నారు. వీరిలో జెసోర్, సత్ఖారీ, గోజడాంగ, హకీంపుర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. సరిహద్దుల్లో సరైన కంచె లేకపోవడం, ‘జీరోలైన్’గా పిలిచే ఇతర దేశ సరిహద్దు ప్రాంతం సమీపం వరకు జనావాసాలు విస్తరించడం ఈ ముఠాలకు కలిసి వస్తోంది. బీజీబీ సహకారంతోనే.. బంగ్లాదేశ్‌లోని కూరిగ్రామ్, లాల్‌మొన్నీర్‌హత్, నీల్ఫామారి, పంమఘార్, థకూర్గావ్, దినజ్‌ప్పూర్, నావ్‌గావ్, చపాయ్ నవాజ్‌గంజ్, రాజ్‌షహీ జిల్లాలు.. పశ్చిమ బెంగాల్‌లోని బినొపొల్ ప్రాంతాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటు బంగ్లా, ఇటు భారత్‌కు చెందిన వ్యవస్థీకృత ముఠాలు పక్కా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అక్రమ రవాణాకు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ) సహకరిస్తోంది. ఒక్కో యువతికి 200 నుంచి 400 టాకాల వరకు వసూలు చేస్తూ సరిహద్దులు దాటించేస్తున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ల పాటు సరిహద్దు గ్రామాల్లోనే వీరిని దాచి ఆపై వివిధ నగరాల్లోని తమ ఏజెంట్లకు విక్రయించేస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది యువతులు, మహిళలు ముంబైకి చేరుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుస్తున్నారు. బెంగళూరు, రాయ్‌పూర్, సూరత్‌లకూ పెద్ద సంఖ్యలో వీరు చేరుతున్నట్లు బీఎస్ఎఫ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. శివార్లలోనే ఎక్కువగా తిష్ట.. హైదరాబాద్ నగరం విభిన్న వర్గాల, ప్రాంతాలకు చెందిన వారి సమాహారం. ఈ నేపథ్యంలోనే ఇక్కడకు వస్తున్న బంగ్లాదేశీ యువతులు తేలిగ్గా స్థానికులతో కలిసిపోతున్నారు. మరోపక్క నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇలాంటి వారి ముసుగులోనే కొందరు బంగ్లాదేశీయులు స్థిరపడుతున్నారు. మరోపక్క హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ముఠాలు ఇలాంటి అక్రమ రవాణా/వలసదారులకు సహకరిస్తున్నాయి. అడ్డదారిలో ఆధార్, ఓటర్ గుర్తింపుకార్డు వంటివి ఇప్పిస్తూ వారిని స్థానికులుగా మార్చేస్తున్నాయి. ఈ వ్యవహారాలను పోలీసు విభాగం దృష్టికి తీసుకువచ్చిన బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. కొత్తగా ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుల కోసం ఎన్రోల్ అవుతున్న మేజర్ల విషయంలో అనేక కోణాల్లో వివరాలు సరిచూసిన తర్వాతే వీటిని జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ అక్రమ రవాణా, వలసదారుల కారణంగా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఎస్ఎఫ్ చెప్పింది. సిటీలో చిక్కిన బంగ్లాదేశీ యువతులు.. ♦ రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గతేడాది మే 28 ఆన్లైన్ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార రాకెట్‌ను పట్టుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న అక్తర్ షబామా అనే మహిళ ఈ రాకెట్లో కీలక పాత్ర పోషించింది. రెస్క్యూ అయిన వారిలో బంగ్లాదేశీ మహిళ సైతం ఉంది. ♦ 2015 మార్చి 6న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంబర్‌పేట కేంద్రంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. దీన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ షేక్ అక్రమ వలసదారుడే. ఇతడి ఆధీనంలో ఉన్న ఏడుగురు బంగ్లాదేశీ యువతుల్ని పోలీసులు రెస్క్యూ చేశారు. వీరంతా అక్రమ రవాణా ద్వారా ఇక్కడకు వచ్చిన వారే. ♦ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 2014 డిసెంబర్ 14న విజయ్‌పురికాలనీ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఇక్కడ ముగ్గురు బంగ్లాదేశీ యువతుల్ని ఈ కూపం నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ జబ్బార్ ఉన్నట్లు గుర్తించారు. -
అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు!
నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి అమ్మాయిలను అక్రమ రవాణా చేయడం వెనక భార్యాభర్తల పాత్ర ఉన్నట్లు తేలింది. అయితే.. వీళ్లిద్దరూ దంపతులమని పైకి చెప్పుకొంటున్నా, వాస్తవానికి ఇద్దరూ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని.. భార్యాభర్తలు కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు. సూర్యాపేట వద్ద జాతీయరహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఆరుగురు అమ్మాయిలు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. వారిని విచారించగా, విశాఖపట్నంలో ఓ ప్రోగ్రాం ఇచ్చేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ, కారులో కండోమ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులు కూడా కనిపించేసరికి పోలీసులకు అనుమానం బలపడింది. దాంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో వారిని గట్టిగా విచారించేసరికి అసలు విషయం తెలిసింది. వారిని సూర్యాపేట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బాలికను వ్యభిచార గృహానికి తరలిస్తూ..
-
బాలికను వ్యభిచార గృహానికి తరలిస్తూ..
బాలికను వ్యభిచార గృహానికి తరలిస్తుండగా మహారాష్ట్ర పోలీసులు రక్షించారు. అక్కడి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు బాలికను నగరానికి తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై రాము తెలిపిన వివరాలు.. సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన 16 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలతో నిత్యం గొడవ పడేవారు. ఇది గమనించిన స్థానిక మహిళ ఆ బాలికను చేరదీసి పని ఇప్పిస్తానని బంజారాహిల్స్‌లోని నిషా అనే మహిళకు అప్పగించింది. ఆమె బాలికను వ్యభిచారం చేయమని బలవంతం చేయడంతో అందుకు బాలిక నిరాకరించింది. దీంతో ఈ నెల 21న నిషా ఆమె ఇద్దరు కుమారులు,మరో ఇద్దరు బంధువులు కలిసి బాలికను ముంబాయి తరలించారు.అక్కడినుంచి పుణెకు వచ్చి వ్యభిచార గృహం నిర్వాహకురాలు అంజుతాప అనే వ్యక్తికి విక్రయించే ప్రయత్నం చేశారు. మైనర్ కావడంతో అందుకు ఆమె నిరాకరించి సమీపంలోని పరిస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి నిషాతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. బాలికను రిస్క్యూ హోమ్‌కు తరలించి సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి బాలికను నగరానికి తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.కేసుదర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.