పశ్చిమగోదావరి, దెందులూరు: బాలికలు, మహిళల అదృశ్యం కేసులు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆచూకీ కానరాని కేసులు భారీగా ఉన్నాయి. ఇది సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. రెండేళ్లల్లో ఏకంగా 932 మంది జిల్లాలో అదృశ్యం కాగా, అందులో 107 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఉన్నారో లేరో కూడా తెలీడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు.
అధికశాతం ‘ప్రేమ’ అదృశ్యాలే
ఇదిలా ఉంటే అధికశాతం అదృశ్య కేసులు ప్రేమ వ్యవహారాల వల్లే జరుగుతున్నట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. శాస్త్ర సాంకేతికాభివృద్ధితోసెల్‌ఫోన్, ఇంటర్‌నెట్, సోషల్ మీడియా విస్తృతమై పెడధోరణులు పెరుగుతున్నాయని, బాలికలు, యువతులు మాయగాళ్లు చెప్పే మాటలకు ఆకర్షితులై ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. అదృశ్యమైన కేసుల్లో 80 శాతం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదిస్తున్నామని, అయినా 20 శాతం అదృశ్యం కేసులు అంతుచిక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. కొన్ని అదృశ్యం కేసులు మానభంగాలు, హత్యలుగా వెలుగు చూస్తున్నాయి. పెద్దలపై కోపంతో కూడా చాలామంది బాలికలు ఇళ్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు జరుగుతున్నట్టు సమాచారం. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు
యువతుల అదృశ్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుస్తున్నాయి. కుటుంబ కలహాల వల్ల చాలామంది ఇళ్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లయిన యువతులు అదృశ్యమైనప్పుడు పిల్లలు బలి అవుతున్నారు. అదృశ్యమైన వారిలో చదువుకున్న వారు, ఉద్యోగులూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రేమ పేరిట మోసాలే ఎక్కువ
అదృశ్యమైన బాలికలు, యువతుల్లో 80 శాతం మంది ప్రేమ పేరిట మోసాలకు గురవుతున్నారు. అదృశ్య ఫిర్యా దులను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం.యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు బదిలీ చేస్తున్నాం. సీసీటీఎన్‌ఎస్(క్రైం అండ్ క్రిమి నల్ ట్రాకింగ్ నెట్‌వర్క్) ద్వారా ఆ యువతుల కదలికల సమాచారాన్ని పసిగడుతున్నాం. గత రెండేళ్లల్లో సమష్టి కృషితో అదృశ్యమైన వారిలో 80 శాతం మందిని కనుగొన్నాం. ఎం.రవిప్రకాష్, ఎస్పీ
జిల్లాలో స్పెషల్ డ్రైవ్
పీజీ, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి మోసం, బాలికలు, యువతుల అక్రమ రవాణా, ప్రలోభాలు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. రెండు నెలలపాటు జిల్లా అంతటా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం.– కె.విజయకుమారి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్
మానసిక ఉపాధ్యాయులు అవసరం
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక ఉపాధ్యా యులను నియమించాలి. హాస్టళ్లు, శిక్షణ కేంద్రాల్లోనూ కౌన్సెలింగ్ ఇప్పించాలి. –కె.హనుమంతు, స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్, గోపన్నపాలెం
Comments
Please login to add a commentAdd a comment