సాక్షి ప్రతినిధి, చెన్నై: యువతుల్లోని అమాయకత్వం వారికి అవకాశం. వారి పేదరికమే వీరి దురాగతాలకు పెట్టుబడి. కావాల్సినంత ధనం, ఖరీదైన జీవితం అంటూ కళాశాల విద్యార్థినులను, యువతులను వ్యభిచార కూపంలోకి దింపే ముఠా ఆగడాలను అరికట్టండి అంటూ కుమార్తెను దూరం చేసుకున్న ఓ బాధిత తల్లి కన్యాకుమారి జిల్లా ఎస్పీకి ఆధారాలు సహా శుక్రవారం ఫిర్యాదు చేసింది. ముఠా చేతిలో చిక్కుకున్న కుమార్తెను రక్షించి అప్పగించాలని శుక్రవారం తన బంధువులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి.
‘తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదువు పూర్తికావడంతో పెళ్లి చేయాలని భావించాం. పెద్దల అభీష్టం ప్రకారం పెళ్లిచేసుకునేందుకు కుమార్తె అంగీకరించడంతో ఒక యువకుడితో నిశ్చితార్థం చేశాను. నిశ్చితార్థం సమయంలో సహజంగానే ప్రవర్తించిన కుమార్తె...వివాహవేడుక రోజు సమీపిస్తుండగా అకస్మాత్తుగా మాయమైంది. తమ బంధువు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లగా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు, ఇంటికి వచ్చేందుకు నిరాకరించింది. నీ కుమార్తె ఇక ఇంటికి రాదు, ఆమెతో మాకు పని ఉంది. పదేపదే వస్తే చంపేస్తామని నన్ను బెది రించారు. ఈ విషయంపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మీ కుమార్తె మేజర్, ఆమెఇష్టప్రకారం నడుచుకునే హక్కుంది అన్నారు. కుమార్తె చేష్టలకు అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్ తీసి పరిశీలించగా అందులో కుమార్తెతో కూడిన అనేక అశ్లీల విడియో దృశ్యాలు ఉన్నాయి. ఏ తల్లీ చూడలేని దృశ్యాలను చూడాల్సి వచ్చింది. నా కూతురే కాదు, ఇంకా ఎందరో యువతుల అశ్లీల దృశ్యాలు, ఫొటోలు ఉన్నాయి.
పేదరికాన్ని అవకాశంగా తీసుకుని యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి జీవితాలను నాశనం చేస్తున్నారనేందుకు నా కుమార్తె సెల్‌ఫోన్‌లోని దృశ్యాలే సాక్ష్యం. ముఠా చేతుల్లో నుంచి నాకుమార్తెను రక్షించి అప్పగించండి. ఇతర యువతులకు విముక్తి కల్పించి కిరాతకులను చట్టపరంగా శిక్షించండని ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే ఆధారాలను అప్పగించారు. ఈ ఫిర్యాదును అన్ని మహిళా పోలీస్‌స్టేషన్లకు పంపి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్‌స్పెక్టర్ శాంతకుమారిని ఎస్పీ ఆదేశించారు.
కొట్టరై అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఉన్న ఒక ముఠా కళాశాల విద్యార్థినులు, యువతులపై వలవేస్తోందని, చేతినిండా డబ్బు, ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన జీవితం అంటూ ఆశచూపి లొంగదీసుకుంటోందని ఆమె మీడియా ముందు వాపోయారు.ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ అని తల్లిదండ్రులకు చెప్పి బంగ్లాకు రా, అక్కడ మరెవరూ ఉండరు, ఒక్క గంట గడిపితే చాలు అంటూ సెల్‌ఫోన్‌లోని సంభాషణలను ఆమె వినిపించారు. ఇది పథకం ప్రకారం సాగుతున్న దురాగతమని ఆమె అన్నారు. కిందిస్థాయి పోలీసులు సహకరించలేదు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment