
ప్రతీకాత్మకచిత్రం
బెంగళూరు: విదేశాల్లో అధిక వేతనంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 7 మందితో కూడిన అక్రమ ముఠాను అరెస్ట్ చేశారు. కొప్పళ కంప్లివాసి బసవరాజశంకరప్ప కళసద్, మైసూరు నజరాబాద్ ఆదర్శ అలియాస్ ఆది, తమిళనాడు సేలం రాజేంద్రనాచి ముత్తు, చెన్నై మారియప్పన్, పాండిచ్చేరి అశోక్, తిరువళ్లువర్ రాజీవ్, జేపీనగర చందు నిందితులని నగర జాయింట్ పోలీస్‌కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు.
ఇప్పటివరకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 95 మంది మహిళలను జూనియర్ ఆర్టిస్టుల పేరుతో పాస్‌పోర్టులు తయారుచేయించి దుబాయ్‌కి పంపించారు. అక్కడ యజమానులు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో గాలింపు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 17 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.