ఆ దేశం బిడ్డలు.. అంగడి బొమ్మలు | bsf Report on woman trafficing from bangladesh | Sakshi
Sakshi News home page

నమ్మించి..అమ్మించె!

Published Thu, Feb 8 2018 9:50 AM | Last Updated on Thu, Feb 8 2018 2:10 PM

bsf Report on woman trafficing from bangladesh - Sakshi

పేదరికంలో మగ్గుతున్న బంగ్లాదేశీయులు తమఉపాధికి ఆశాకిరణంగా భారత్‌ను భావిస్తున్నారు. ఇక్కడికి వస్తే తమ కుటుంబానికి బతుకుదెరువు దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు అక్రమార్కుల చేతిలో పడి మోసపోతున్నారు. ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా అవుతున్న మహిళలు, యువతులు హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్టు తేలింది. ఈ అంశంలో ముంబై తర్వాతి స్థానం నగరానిదే కావడం గమనార్హం.

‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: మోడెస్‌ ఆపరెండీ ఆఫ్‌ టాట్స్‌ ఆన్‌ ఇండో–బంగ్లాదేశ్‌ బోర్డర్‌’ పేరుతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. నగరానికి వస్తున్న వారికి శివార్లలోని పారిశ్రామిక వాడలు, మసాజ్‌ పార్లర్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మరోపక్క కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ముఠాలు బంగ్లా యువతులను ప్రధానంగా వ్యభిచార కేంద్రాలకు విక్రయిస్తున్నాయి. డ్యాన్స్‌ బార్లు, మసాజ్‌ పార్లర్లు, ఇళ్లల్లో పనిమనుషులు గాను వారిని మార్చేస్తున్నాయి. అక్రమ రవాణా బాధితుల్లో అనేకమంది బానిస     కూలీలుగానూ బతుకుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.

సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోకి రవాణా అవుతున్న బాధితుల పరిస్థితిపై బీఎస్‌ఎఫ్‌ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో అనేక ఎన్‌జీఓల సహకారం తీసుకుంది. ఈ అధ్యయనం ఆధారంగా  ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌: మోడెస్‌ ఆపరెండీ ఆఫ్‌ టాట్స్‌ ఆన్‌ ఇండో–బంగ్లాదేశ్‌ బోర్డర్‌’ నివేదికను రూపొందించింది. ఈ ట్రాఫికింగ్, హైదరాబాద్‌లో తిష్టవేస్తున్న అక్రమ బంగ్లాదేశీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీఎస్‌ఎఫ్‌ పోలీసు విభాగాన్ని హెచ్చరించింది. 

అక్కడ ఢాకా.. ఇక్కడ కోల్‌కతా..
బీఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం ఏటా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి కనీసం 50 వేల మంది బాలికలు, యువతులు అక్రమంగా రవాణా అవుతున్నారు. వీరిలో ప్రధానంగా 12 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. భారత్‌–బంగ్లా సరిహద్దుల్లో మాటు వేసిన కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నాయి. ఇవన్నీ బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తూ ఇందుకు కోల్‌కతాను ప్రధాన కేంద్రంగా వినియోగించుకుంటున్నాయి. బంగ్లాదేశీ యువతులు, మహిళలను తొలుత అక్కడికి రప్పించి ఆపై దేశంలోని అనేక నగరాలకు రవాణా చేస్తున్నాయి.  
 
దళారుల్లో మహిళలూ ఉన్నారు..  
ఢాకా మొదలు భారత్‌ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల వరకు అనేక మంది దళారులు ఓ సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ రవాణా దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో దళారులుగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశీయుల్లో 84 శాతం పురుషులు ఉండగా 16 శాతం మహిళలు ఉంటున్నారు. బంగ్లాదేశీయులను ట్రాప్‌ చేయడానికి ఈ దళారులు అనేక రకాలుగా ఎర వేస్తున్నారు. భారత్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయని, ఇంటి పనులు చేసే వారికి డిమాండ్‌ ఉందని చెబుతున్నాయి. కాస్త ఆకర్షణీయంగా ఉన్న యువతులకు సినిమాల్లో అవకాశాలు, ప్రేమ–పెళ్లి పేరుతో సరిహద్దులు దాటేలా కథ నడిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రామాల్లోని నిరుపేదలే వీరికి టార్గెట్‌గా మారుతున్నారు. వీరిలో జెసోర్, సత్ఖారీ, గోజడాంగ, హకీంపుర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. సరిహద్దుల్లో సరైన కంచె లేకపోవడం, ‘జీరోలైన్‌’గా పిలిచే ఇతర దేశ సరిహద్దు ప్రాంతం సమీపం వరకు జనావాసాలు విస్తరించడం ఈ ముఠాలకు కలిసి వస్తోంది.  
 
బీజీబీ సహకారంతోనే..  
బంగ్లాదేశ్‌లోని కూరిగ్రామ్, లాల్‌మొన్నీర్‌హత్, నీల్ఫామారి, పంమఘార్, థకూర్గావ్, దినజ్‌ప్పూర్, నావ్‌గావ్, చపాయ్‌ నవాజ్‌గంజ్, రాజ్‌షహీ జిల్లాలు.. పశ్చిమ బెంగాల్‌లోని బినొపొల్‌ ప్రాంతాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటు బంగ్లా, ఇటు భారత్‌కు చెందిన వ్యవస్థీకృత ముఠాలు పక్కా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అక్రమ రవాణాకు బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్‌ గార్డ్స్‌ బంగ్లాదేశ్‌ (బీజీబీ) సహకరిస్తోంది. ఒక్కో యువతికి 200 నుంచి 400 టాకాల వరకు వసూలు చేస్తూ సరిహద్దులు దాటించేస్తున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ల పాటు సరిహద్దు గ్రామాల్లోనే వీరిని దాచి ఆపై వివిధ నగరాల్లోని తమ ఏజెంట్లకు విక్రయించేస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది యువతులు, మహిళలు ముంబైకి చేరుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుస్తున్నారు. బెంగళూరు, రాయ్‌పూర్, సూరత్‌లకూ పెద్ద సంఖ్యలో వీరు చేరుతున్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

శివార్లలోనే ఎక్కువగా తిష్ట..
హైదరాబాద్‌ నగరం విభిన్న వర్గాల, ప్రాంతాలకు చెందిన వారి సమాహారం. ఈ నేపథ్యంలోనే ఇక్కడకు వస్తున్న బంగ్లాదేశీ యువతులు తేలిగ్గా స్థానికులతో కలిసిపోతున్నారు. మరోపక్క నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇలాంటి వారి ముసుగులోనే కొందరు బంగ్లాదేశీయులు స్థిరపడుతున్నారు. మరోపక్క హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ముఠాలు ఇలాంటి అక్రమ రవాణా/వలసదారులకు సహకరిస్తున్నాయి. అడ్డదారిలో ఆధార్, ఓటర్‌ గుర్తింపుకార్డు వంటివి ఇప్పిస్తూ వారిని స్థానికులుగా మార్చేస్తున్నాయి. ఈ వ్యవహారాలను పోలీసు విభాగం దృష్టికి తీసుకువచ్చిన బీఎస్‌ఎఫ్‌ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. కొత్తగా ఓటర్‌ ఐడీ, ఆధార్‌కార్డుల కోసం ఎన్‌రోల్‌ అవుతున్న మేజర్ల విషయంలో అనేక కోణాల్లో వివరాలు సరిచూసిన తర్వాతే వీటిని జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ అక్రమ రవాణా, వలసదారుల కారణంగా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఎస్‌ఎఫ్‌ చెప్పింది.  

సిటీలో చిక్కిన బంగ్లాదేశీ యువతులు..
రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు గతేడాది మే 28 ఆన్‌లైన్‌ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార రాకెట్‌ను పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న అక్తర్‌ షబామా అనే మహిళ ఈ రాకెట్‌లో కీలక పాత్ర పోషించింది. రెస్క్యూ అయిన వారిలో బంగ్లాదేశీ మహిళ సైతం ఉంది.  
2015 మార్చి 6న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అంబర్‌పేట కేంద్రంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. దీన్ని నిర్వహిస్తున్న అబ్దుల్‌ షేక్‌ అక్రమ వలసదారుడే. ఇతడి ఆధీనంలో ఉన్న ఏడుగురు బంగ్లాదేశీ యువతుల్ని పోలీసులు రెస్క్యూ చేశారు. వీరంతా అక్రమ రవాణా ద్వారా ఇక్కడకు వచ్చిన వారే.
సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు 2014 డిసెంబర్‌ 14న విజయ్‌పురికాలనీ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఇక్కడ ముగ్గురు బంగ్లాదేశీ యువతుల్ని ఈ కూపం నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ జబ్బార్‌ ఉన్నట్లు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement