
నయీం డైరీలో ఏముందో..?
– ఎవరి నోట విన్నా అదే చర్చ
– ఫిర్యాదు చేస్తే భూములు వస్తాయా
భువనగిరి : పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నయీం డైరీలో ఏముందోనన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. నయీం కేసును సిట్‌కు అప్పగించిన నేపథ్యంలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయకున్నా, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా నయీం ముఠాలకు సహకరిస్తూ అతని దందాల్లో సహకరించిన అధికారులు,ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విలేకరులు, ఇలా పలువురి పేర్లు ఉన్నాయన్న సమాచారం డైరీలో ఉందని వస్తున్న వార్తలు అన్ని వర్గాల్లో అసక్తిని రేకిస్తోంది. డైరీలో పేర్లు ఉన్నందున అతని దందాలతో సంబంధం ఉన్న వారంతా వెలుగులోకి రావడం ఖాయం. డైరీలో ఉన్న పేర్లు ఎవరివై ఉంటాయన్నా చర్చ జరుగుతోంది.
మా భూములు మాకు వస్తాయా ..
నయీం బెదిరింపులతో భూములు కోల్పోయిన బాధితులు మా భూములు మాకు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, వలిగొండ,బీబీనగర్, బొమ్మలరామారం ఇలా పలు మండలాల్లో కోట్ల రూపాయల విలువచేసే భూములను బెదిరించి నయీమ్‌ం తక్కువ ధరకు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాము నష్టపోయిన భూములు తమకు ప్రభుత్వం ఇప్పిస్తుందా అన్న కోణంలో బాధితులు ఎదురు చూస్తున్నారు.
ఈ విషయంపై ఫిర్యాదు చేయాలా ఎవరికి చేయాలి అన్న మీమాంసలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బుధవారం కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఫిర్యాదు దారులు తమ పేర్లు బయటపెట్ట వద్దని కోరుతున్నట్లు సమాచారం. మరో వైపు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
గుట్టుగా సాగుతున్న విచారణ
మరో వైపు నయీం ముఠాతో వివిధ వర్గాలకు ఉన్న సంబంధాలపై గుట్టుగా విచారణ సాగుతోంది. ఇప్పటికే భువనగిరి, వలిగొండల్లో అక్రమ అయుధాలు కలిగిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం అనుచరులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇప్పటికే పోలీసుల వద్ద ఉంది. దీంతోపాటు ఎవరెవరు అతనికి సహకరించారన్న విషయంలో పోలీసులు దృష్టి సారించారు. భూములు, డబ్బుల విషయంలో ఎక్కువ దందా నడవడంతో అందులో సంబంధం ఉన్నవారెవరన్న విషయంపై విచారణ అత్యంత గోప్యంగా జరుగుతోంది.