వైఎస్సార్సీపీలోకి గంగుల
⇒ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
⇒ పెద్ద సంఖ్యలో చేరిన నాయకులు, కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి, తనయుడు గంగుల బిజేంద్రరెడ్డి(నాని)తో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి, గంగుల నాని, జెడ్పీటీసీ కో–ఆప్షన్ మెంబరు షేక్‌బాబులాల్, తిరువెళ్ల జెడ్పీటీసీ నజీర్, రుద్రవరం జెడ్పీటీసీ వెంకటరమణమ్మ, ఆళ్లగడ్డ ఎంపీపీ బండి చంద్రుడు, ఆళ్లగడ్డ కౌన్సిలర్లు అఫ్జల్, ఎస్. శ్రీదేవి, నీటి సంఘం డీసీ సభ్యుడు జాఫర్ రెడ్డి, జి. రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు : గంగుల ప్రభాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలను నమ్మి ఎన్నుకున్న ప్రజలను మోసం చేశారని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలను, పార్టీ నాయకుల ను మోసగించడం ఆయనకు అలవాటేనని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుభాష్‌రెడ్డి, గంగుల బిజేంద్రరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబరు బాబులాల్‌లతో కలసి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో చేరడం పట్ల చాలా ఆనందంగా ఉందని గంగుల తెలిపారు. వైఎస్సార్‌సీపీలో చేరదామని, జగన్ నాయకత్వాన్ని బలపరుద్దామని తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలంతా ముక్తకంఠంతో చెప్పారని ఆయన అన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవకర్గంలో 35 ఎంపీ టీసీలు, ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు కౌన్సిలర్లు, 53 నీటి సంఘాల అధ్యక్షుల్లో 50 మంది అధ్యక్షులు, 37 మంది çసర్పంచులను గెలిపించుకున్నానని చెప్పారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన వారందరినీ వైఎస్సార్‌సీపీలో చేర్చుతామని చెప్పారు. గతంలో భూమా నాగిరెడ్డి అనే విషపు మొక్కను నాటానని 2012 ఎన్నికల్లో చంద్రబాబే చెప్పి బహిరంగంగా క్షమించమని కోరారని చెప్పారు. ఇవాళ ఆ విష వృక్షాన్నే చంద్రబాబు కౌగిలించుకుంటున్నారని ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంత్రి పదవే కాదు.. చివరికి చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వొచ్చేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. త్వరలోనే సమీకరణలు జరుగుతాయని గంగుల అన్నారు. గత డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారని, అక్కడ అసంతృప్తితో తాను వచ్చిన విధంగానే వాళ్లంతా కూడా రావచ్చన్న అభిప్రాయాన్ని ప్రభాకర్‌రెడ్డి వ్యక్తం చేశారు.