‘జన్యుమార్పిడి’కి రంగం సిద్ధం! | 'Genetically modified' to prepare the sector! | Sakshi
Sakshi News home page

‘జన్యుమార్పిడి’కి రంగం సిద్ధం!

Published Thu, Dec 31 2015 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

‘జన్యుమార్పిడి’కి రంగం సిద్ధం!

‘జన్యుమార్పిడి’కి రంగం సిద్ధం!

♦ బహుళజాతి విత్తన కంపెనీల నుంచి వచ్చిన 10 దరఖాస్తుల పరిశీలన
♦ క్షేత్రస్థాయిలో పరీక్షలకు అనుమతిస్తే తప్పులేదన్న వ్యవసాయ వర్సిటీ!
♦ వ్యవసాయశాఖకు తాజాగా నివేదిక అందజేసిన శాస్త్రవేత్తల బృందం
♦ రాష్ట్రంలో అనుమతి ఇచ్చే అంశంపై త్వరలో కమిటీ సమావేశం
 
 సాక్షి, హైదరాబాద్: వరి, జొన్నల్లో జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.  ఒకవైపు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ జన్యు మార్పిడి పరీక్షలను నిషేధించినా.. వాటిని అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జన్యు మార్పిడి పంటలను అనుమతించడాన్ని వ్యతిరేకించినా రాష్ర్ట ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది.

 బహుళజాతి కంపెనీల నుంచి..
 రాష్ట్రంలో వరి, జొన్న పంటల్లో జన్యుమార్పిడికి క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బహుళజాతి విత్తన కంపెనీలైన మోన్‌శాంటో, బేయర్, మహికో, పయనీర్ సహా పది కంపెనీలు తెలంగాణ వ్యవసాయశాఖకు దరఖాస్తు చేశాయి. జన్యు మార్పిడి పం టల ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు వ్యవసాయశాఖ కార్యద ర్శి చైర్మన్‌గా, డెరైక్టర్ సభ్య కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతీ తెలిసిందే. కమిటీ ఏర్పాటైనప్పటినుంచి జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతించే అంశంపై అంతర్గతంగా పలు నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి.

 అనుమతిపై వ్యవసాయ వర్సిటీ పరిశోధన కేంద్రం సానుకూలత
 బహుళజాతి కంపెనీల నుంచి వచ్చిన 10 దరఖాస్తులను అధ్యయనం చేయాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీని వ్యవసాయశాఖ ఆదేశించింది. జన్యుమార్పిడి పంటలకు అనుమతి ఇవ్వొచ్చా? ఇస్తే జరిగే నష్టాలేంటి? లాభాలేంటి? వంటి అంశాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ కోరింది. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు జన్యుమార్పిడికి సానుకూలత వ్యక్తంచేస్తూ వ్యవసాయశాఖకు నివేదిక ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెప్పాయి. అయితే ఆ నివేదిక అంశాలపై వ్యవసాయశాఖ అత్యంత గోప్యత పాటిస్తోంది.
 
 జీవ భద్రత పరీక్షలు చేయకుండానే..
 జన్యు మార్పిడి పరీక్షలు రెండు రకాలుగా చేస్తా రు. మొదటివి జీవ భద్రత పరీక్షలు, రెండోవి దిగుబడి ఎంతొస్తుందో తెలుసుకునే క్షేత్రస్థాయి పరీక్షలు. కంపెనీలు మాత్రం క్షేత్రస్థాయి పరీక్షలకే అనుమతి కోరుతున్నాయి. జీవ భద్రత పరీక్షలు ఎందుకు చేయట్లేదని శాస్త్రవేత్తలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. కానీ కంపెనీలు అందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు.
 
 కమిటీ ఆమోదమే తరువాయి..
 జన్యుమార్పిడికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ యే.  త్వరలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం కాబట్టి బహుళజాతి కంపెనీల నుంచీ ఒత్తిడి పెరిగింది. ఆయా కంపెనీలు పెద్దఎత్తున రాజకీయ లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వరి, జొన్నలపై జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతిస్తే ఇక రైతు భవిష్యత్తు అంధకారమే అవుతుందని రైతు నేతలు అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement