‘కౌన్ బనేగా కార్పొరేటర్’ | GHMC Elections Special Stories... | Sakshi
Sakshi News home page

‘కౌన్ బనేగా కార్పొరేటర్’

Published Tue, Jan 19 2016 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

‘కౌన్ బనేగా కార్పొరేటర్’

‘కౌన్ బనేగా కార్పొరేటర్’

చిక్కడపల్లిలోని అరోరా కళాశాల ఎంటర్‌పెన్యూర్‌షిప్ డెవెలప్‌మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ సుశీల కాండూరి...

* 'నెట్టింట్లో... నిలదీయండి' అంటూ వెబ్ సైట్ వినూత్న పిలుపు
* 150 డివిజన్ల సమాచారంతో వినూత్నంగా సిటీజనుల ముందుకు


చిక్కడపల్లిలోని అరోరా కళాశాల ఎంటర్‌పెన్యూర్‌షిప్ డెవెలప్‌మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ సుశీల కాండూరి... 30 మంది ఔత్సాహిక విద్యార్థులను ఎంపిక చేసి ‘కౌన్‌బనేగా కార్పొరేటర్’ పేరుతో ప్రత్యేక సామాజిక వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. డివిజన్ల వారీగా పార్టీ పరంగా బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఇచ్చిన హామీలతో ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి.. ఆ తర్వాత ముఖం చాటేసే నేతలను నెట్టింట్లోనే నిలదీసే అవకాశం కల్పించారు.
 
ఫేజ్-1: మాజీల పనితీరుపై సర్వే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే సమయానికి హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కౌన్‌బనేగా కార్పొరేటర్.కామ్ పోర్టల్‌లో తాజా మాజీ కార్పొరేటర్ల వివరాలు పొందుపర్చారు. ఈ పోర్టల్‌లో గ్రేటర్ మ్యాప్‌తో పాటు 150 డివిజన్ల పేర్లను ఉంచారు. హోమ్‌పేజ్‌లో ఉన్న నగర భౌగోళిక పటం కింద సూచించిన డివిజన్‌ను ఎంపిక చేసుకుంటే డివిజన్ పేరు, కార్పొరేటర్ పేరు కనిపిస్తాయి. ఆ పక్కనే ఆ కార్పొరేటర్ పనితీరుపై మీ స్పందన తెలియజేసేందుకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. గత ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధి వగైరా అంశాల ఆధారంగా ఆ కార్పొరేటర్‌కు రేటింగ్ ఇవ్వొచ్చు. ఇందులో గుడ్, పరవాలేదు, సంతృప్తికరం అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఒక ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత మరోసారి ఓటేయడం కుదరదు. ఇలాంటి రిగ్గింగ్ జరగకుండా అరోరా విద్యార్థులు ముందు జాగ్రత్తలు పాటించారు. ఒకసారి ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ కంప్యూటర్ ఐపీ నంబర్‌ను పోర్టల్ స్వీకరిస్తుంది. ఆ తర్వాత యత్నించినా ఈవీఎంలా ఇది కూడా తిరస్కరిస్తుంది.  
 
ఫేజ్-2: బరిలో నిలిచిన అభ్యర్థుల బయోడేటా
గ్రేటర్‌లో నామినేషన్ల ఉపసంహరణకు మరో మూడు రోజుల గడువు ఉంది. ఇది పూర్తై తర్వాత పార్టీల గుర్తుపై వార్డుల వారీగా పోటీ చేసే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన పేర్లు, ఫొటోలను ఎన్నికల కమిషన్ నుంచి సేకరిస్తారు. అరోరా కళాశాల విద్యార్థులంతా ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు వారి వ్యక్తిగత చరిత్ర, రాజకీయ నేపథ్యం, ఇతర సేవా కార్యక్రమాలు వంటి అంశాలు పోర్టల్‌లో పొందుపర్చనున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న సమస్యలు, ఎన్నికల్లో భాగంగా వారు ఇచ్చిన హామీలను ఇందులో ఉంచుతారు. మరో నాలుగు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలతో ఎక్కువ పరిచయం ఉన్న యువతకు ఈ పోర్టల్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా మంచి అభ్యర్థులను ఎంచుకుని ఓటేసే అవకాశం ఉంది.
 
ఫేజ్-3: గెలిచిన అభ్యర్థులు..హామీలు

ఎన్నికల తర్వాత కూడా కౌన్‌బనేగా కార్పొరేటర్ పోర్టల్ ఓటర్లకు అందుబాటులో ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ఫొటోలతో పాటు వారి వ్యక్తిగత సమాచారం, ఇచ్చిన హామీలను ఇందులో పొందుపరుస్తారు. నెరవేర్చిన హామీలు, పెండింగ్‌లో ఉన్న హామీల గురించి పోర్టల్‌లో ఓటర్లు రాయవచ్చు. అంతేకాదు ఎన్నికల తర్వాత ముఖం చాటేసే నేతలను నిలదీసే అవకాశం ఉంది. కార్పొరేటర్ పనితీరుపై ఫేస్‌బుక్‌లో కామెంట్ రాయడంతో పాటు వాటిని ఇతరులకు షేర్ చేసే అవకాశం కూడా ఇందులో కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement