
ఎక్కడో కన్నేసి... ఇక్కడ వదిలేసి!
సొంత ఆస్తులపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం
భారీగా అద్దె బకాయిలు
వసూలుపై శ్రద్ధ చూపని యంత్రాంగం
సిటీబ్యూరో : తన ఖజానాను నింపుకొనేందుకు ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఉల్లంఘనలు... నివాస గృహాల్లో కొనసాగుతున్న వాణిజ్య కార్యకలాపాలపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ తన ఎస్టేట్ విభాగంలోని దుకాణ సముదాయాలకు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు రావాల్సిన అద్దె బకాయిలపై శ్రద్ధ చూపడ ం లేదు. ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు, ట్రేడ్ లెసైన్సు ఫీజుల వసూలుకు ఎంతో శ్రద్ధ చూపుతున్నప్పటికీ... జీహెచ్‌ఎంసీకి చెందిన మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్‌లలోని మడిగెలు/ షాపులకు అద్దె రూపేణా రావాల్సిన మొత్తం ఏళ్ల తరబడి జమ కాకున్నా పట్టించుకోవడం లేదు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే వీటి అద్దె తక్కువ. స్వల్ప మొత్తాన్ని సైతం చెల్లించకుండా దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. 2012 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 17 షాపింగ్ కాంప్లెక్స్‌లలోని 953 దుకాణాల నుంచి దాదాపు రూ.10.06 కోట్లు అద్దెగా రావాల్సి ఉండగా... కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగతా రూ.7.57 కోట్లు బకాయిలు అలాగే ఉన్నాయి.
25 మార్కెట్లలోని 2310 మడిగెలకు 2012 ఏప్రిల్ నుంచి 2013 మార్చి వరకు రూ.2.99 కోట్లు రావాల్సి ఉండగా, రూ.65.37 లక్షలే వసూలయ్యాయి. మిగిలిన మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు కాంప్లెక్స్‌లకు సంబంధించిన రూ.10 కోట్లకు పైగా అద్దె బకాయిలు అలాగే ఉన్నాయి. ఇక 2013 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎంత వసూలైందో... ఎన్ని బకాయిలు ఉన్నాయో కనీసం లెక్కలు లేవు. ఎంతలేదన్నా ఇవి మరో రూ.10 కోట్లకు పైనే ఉంటాయి. ఇతరుల ఆస్తుల నుంచి రావాల్సిన పన్నుపై శ్రద్ధ చూపుతున్న జీహెచ్‌ఎంసీ.. తన సొంత ఆస్తులపై రావాల్సిన అద్దెలను పట్టించుకోకపోవడం విడ్డూరం.