హైదరాబాద్: సివరేజీ పైప్‌లైన్ పనులు జరుగుతున్న చోట ఓ వ్యక్తి బ్యారికేడ్లు ఢీకొని 22 అడుగుల లోతు గొయ్యిలో పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సివరేజీ పైప్‌లైన్ పనులు నడుస్తున్నాయి. విదేశీ టెక్నాలజీ సాయంతో కేవలం మ్యాన్‌హోల్స్ వద్ద గోతులు తీసి సొరంగ మార్గం ద్వారానే యంత్రాలు పంపి పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయ్యాయి.
ఈ పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మ్యాన్‌హోల్ వద్ద 22 అడుగుల గొయ్యి తీసి పనులు చేస్తున్నారు. కాగా గత గురువారం ఓ ద్విచక్రవాహనదారుడు వాహనం అదుపుతప్పి సదరు గొయ్యిలో పడిపోయాడు. అతని వాహనం పక్కనే ఉన్న గ్రిల్స్‌పై పడగా.. మనిషి మాత్రం అందులో పడ్డాడు. అప్పటికే సదరు గొయ్యిలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్, ముక్తార్‌లపై వాహనదారుడు పడడంతో ఒక్కసారిగా అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు వారిని బయటకు తీశారు.
బయటకు రాగానే బాధితుడు అతని వాహనాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులకు కూడా సమాచారం లేకపోవడంతో విషయం బయటకు పొక్కలేదు. శనివారం అందులో పనిచేస్తున్న కార్మికులు విషయం పలువురికి చెప్పడంతో మీడియాకు తెలిసింది. అనంతరం అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఘటన జరిగినట్లు నిర్ధారించారు. బాధితుడి వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment