పోరాడి ఓడిన ప్రేమ.. | girl dies of injuries from suicide attempt | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన ప్రేమ..

Published Fri, Feb 14 2014 8:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

పోరాడి ఓడిన ప్రేమ..

పోరాడి ఓడిన ప్రేమ..

*చికిత్సపొందుతూ బాధితురాలు షీలా మృతి
* ప్రేమికుల దినోత్సవం వేళ విషాదం
 * ప్రియుడు, అతని తల్లిదండ్రులు,  ఇద్దరు సోదరిలపై హత్య కేసు నమోదు
 * ఐదుగురూ రిమాండ్‌కు తరలింపు

 ముషీరాబాద్, న్యూస్‌లైన్: ప్రేమ చివరకు ఓడిపోయింది... వంచనకు తలవంచింది.... ప్రియుడు, అతని తల్లిదండ్రులు అకృత్యానికి బలైపోయింది.... కాలినగాయాలతో మృత్యువుతో ఐదు రోజులపాటు పోరాడిన బాధితురాలు షీలా చికిత్సపొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది.  ప్రపంచ ప్రేమికుల దినోత్సవానికి ఒకరు రోజు ముందే ఆ అభాగ్యురాలు కన్నుమూయడం అందరి హృదయాలను కలచివేసింది.  పోలీసుల కథనం ప్రకారం...  చిక్కడపల్లి ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన  జంగా షీలా (21), రాంనగర్ డివిజన్ జెమినీకాలనీకి చెందిన సాయి(20) ఇంటర్ కలిసి చదువుకున్నారు.   

అప్పటి నుంచీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.  తండ్రి ధర్మపురి మృతి చెందగా... తల్లితో కలిసి షీలా నివాసముంటోంది.  ప్రస్తుతం షీలా చిక్కడపల్లిలోని పెండే కంటి లా కాలేజీలో  రెండో సంవత్సరం చదువుతుండగా..  సాయి సీఏ చేస్తున్నాడు. ఇతని తండ్రి చంద్రశేఖర్ వ్యాపారి. తనను పెళ్లి చేసుకోవాలని నెల రోజులుగా  షీలా ప్రియుడు సాయిపై  ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. జిమ్‌కు వెళ్లిన సాయి పది నిమిషాల తర్వాత వచ్చాడు.  షీలా నేరుగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు అతడిని తిట్టడంతో బయటకు వెళ్లిపోయాడు.

అక్కడే ఉన్న  షీలాను కూడా వారు దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది.  షీలా తనకు తానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందా? లేక ప్రియుడి తల్లిదండ్రులే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారా? అనే దానిపై మొదట్లో పలు అనుమానాలు రేకెత్తాయి.  కాగా, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్‌లు గాంధీ ఆస్పత్రిలో 86 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలిని విచారించారు.

తనపై ప్రియుడి తల్లిదండ్రులే కిరోసిన్ పోసినిప్పంటించారని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ప్రియుడు సాయి,  అతని తండ్రి చంద్రశేఖర్, తల్లి సునీతతో పాటు ఇద్దరు చెల్లెళ్లపై హత్యాయత్నం (ఐపీసీ 307) కేసు నమోదు చేశారు.  బాధితురాలు చికిత్సపొందుతూ గురువారం మృతి చెందడంతో ఈ కేసును హత్య (ఐపీసీ 302)గా మార్చారు. అలాగే, మృతురాలు ఎస్సీ కావడంతో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.  నిందితులందరినీ గురువారం అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement