ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేసిన ప్రియుని ఇంటిముందు ఓ యువతి ధర్నా చేస్తోంది.
తుర్కయాంజాల: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేసిన ప్రియుని ఇంటిముందు ఓ యువతి ధర్నా చేస్తోంది. ఈ సంఘటన తుర్కయాంజాల మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం సుధీర్‌రెడ్డి నాదర్‌గుల్లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
గతంలో సుధీర్‌రెడ్డి.. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతోన్న తుర్కయాంజాల శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన యాంపాల ఉమామహేశ్వరి(22)ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. తొలుత అంగీకరించని ఉమామహేశ్వరి తర్వాత అతని ప్రేమను అంగీకరించింది. పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేయడంతో ఉమామహేశ్వరి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సుధీర్‌రెడ్డి నివాసం ఉంటున్న బ్రాహ్మణపల్లెకు వెళ్లి ఇంటి ముందు కూర్చుని తనకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తోంది. గమనించిన సుధీర్‌రెడ్డి కుటుంబసభ్యులు గేటుకు తాళం వేసుకుని ఇంటిలోపలే ఉన్నారు. తనకు న్యాయం జరిగేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించింది.