మైనింగ్ ఇంజనీరింగ్‌కు బాలికలు అర్హులే
- జేఈఈ రివైజ్డ్ షెడ్యూల్ జారీ
- ఈసారి నాలుగు కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు
- 29 నుంచి దరఖాస్తులు
- వచ్చే నెల 22న అడ్వాన్స్‌డ్ పరీక్ష
- మహబూబ్‌నగర్, తిరుపతిలోనూ పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఐఐటీ గువాహటి జారీ చేసింది. ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో బాలికలు కూడా అర్హులేనని ప్రకటించింది. ఈసారి పాత ఐఐటీలతోపాటు 4 కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఐఐటీ ఛత్తీస్‌గఢ్, ఐఐటీ గోవా, ఐఐటీ కర్ణాటక, ఐఐటీ జమ్మూల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే 22న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ, ఏపీలోని పాత కేంద్రాలతో పాటు మరో రెండు అదనంగా కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ , వరంగల్‌లో పరీక్ష కేంద్రాలుండగా, మహబూబ్‌నగర్‌లో అదనంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఇక ఏపీలో విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు తిరుపతిలోనూ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 102 రకాల కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామని వెల్లడించింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో అత్యధిక స్కోర్ సాధించిన టాప్ 2 లక్షల మందిలో ఏ కేటగిరీలో ఎందరిని తీసుకుంటారనే వివరాలను తెలిపింది. ఇక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) కార్డు కలిగిన వారు జనరల్, ఓపెన్ కేటగిరీ సీట్లకు కూడా అర్హులేనని ప్రకటించింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే వారు సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని ఐఐటీ గువాహటి పేర్కొంది. ఇందులో ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్‌సీఎల్) వారిని 27 శాతం, ఎస్సీలను 15 శాతం, ఎస్టీలను 7.5 శాతం, ఓపెన్ కేటగిరీలో 50.5 శాతం మందిని తీసుకుంటామని వెల్లడించింది. వీటి ప్రకారం ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. పరీక్ష ఫీజు కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1000, ఇతర అభ్యర్థులు రూ.2 వేలు, దుబాయిలో పరీక్ష కేంద్రం కావాలనుకునే వారు 220 అమెరికా డాలర్లు చెల్లించాలి. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే 70 శాతం మార్కులు సాధించాలి. లేదా ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. టాప్-20 పర్సంటైల్ నిర్ధారణకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఒక భాష, మరొక సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను తీసుకొని లెక్కిస్తారు.