ఇంటర్ ఫలితాలను వెల్లడించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ రంగారెడ్డి జిల్లా అత్యధిక ఉత్తీర్ణతశాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బాలికలు కూడా అంతే.. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ఫలితాలను సకాలంలో ఇచ్చినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. కొత్తగా బోర్డు ఏర్పడిన నేపథ్యంలో ఫలితాలు సకాలంలో వస్తాయా? లేదా? అన్న అనుమానం ఉన్నప్పటికీ బాగా పని చేసి సరైన సమయంలో ఫలితాలు ఇచ్చారని కొనియాడారు. భవిష్యత్తులో బోర్డు అధికారులు మరింత బాగా పని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి సతీష్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, సలహాదారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 1000 మార్కులకు గాను టాప్ మార్కులు 991. ఈ మార్కులను ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు సాధించగా, బైపీసీలో ఒక్కరే సాధించారు.
మొత్తంగా చూస్తే 54.57 శాతం ఉత్తీర్ణత
ఇంటర్మీడియెట్ ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 74.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం లో నిలవగా, 50.26 శాతంతో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 64.18 శాతంతో హైదరాబాద్, 64.08 శాతంతో ఖమ్మం ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రెగ్యులర్ విద్యార్థులు 3,78,973 మంది పరీక్షలకు హాజరుకాగా 2,32,742 మంది (61.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 93,500 మంది హాజరుకాగా 25,439 మంది (27.21 శాతం) పాసయ్యారు. ఇక వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 25,488 మంది పరీక్షలకు హాజరుకాగా 15,054 మంది (59.06 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 7,242 మంది హాజరుకాగా 2,474 మంది (34.38 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే అన్ని విభాగాల్లో కలిపి 54.57 శాతం మంది పాసయ్యారు.
మళ్లీ బాలికలదే పైచేయి..
మొదటి సంవత్సర ఫలితాల్లోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. బాలుర కంటే బాలికలే 11 శాతం మేర అధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచారు. బాలికలు 1,90,483 మంది హాజరుకాగా 1,27,355 మంది (66.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 1,88,490 మంది పరీక్షలకు హాజరుకాగా 1,05,387 మంది (55.91 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో బాలికలు 34,486 మందికిగాను 10,857 మంది (31.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 150 మంది విద్యార్థులు డీబార్‌కాగా, వివిధ కారణాలతో 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు.
మే 1 నాటికి మార్కుల జాబితాలు
మూడు రోజుల్లో మార్కుల రిజిస్టర్లను రీజనల్ ఇన్‌స్పెక్షన్ (ఆర్‌ఐవో) అధికారులకు పంపిస్తారు. మార్కుల జాబితాలను ఆర్‌ఐవోల నుంచి సంబంధిత ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లవచ్చు. వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. మెమోల్లో ఏమైనా పొరపాట్లు వస్తే మే 27లోగా సం బంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
♦ ఫీజు చెల్లింపునకు మే 6 వరకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు ఉంటాయి. ఎథిక్స్, మానవీయ విలువల పరీక్ష జూన్ 8న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 9న ఉంటుంది.
ఈ రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్‌సైట్‌లో http://bie.telangana.gov.in త్వరలోనే పొందుపరుస్తారు. విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును మే 6వ తేదీలోగా చెల్లించాలి. ఆలస్య రుసుముతో చెల్లింపునకు అవకాశం లేదు. ప్రైవేటు విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయి. వొకేషనల్ కోర్సులు చదివిన పాత విద్యార్థులు పాత సిలబస్‌లో పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం. హాజరు మినహాయింపు పొందిన వారు ఆర్ట్స్, కామర్స్ పరీక్షలకోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను కలసి ఫీజు చెల్లించాలి.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, ఫొటో కాపీకి అవకాశం
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 600 చొప్పున మీసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి.
‘ద్వితీయ’లోనూ బాలికలదే హవా
Published Tue, Apr 28 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement
Advertisement