Intermediate Board Office
-
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్లో సీటు కల్పించాలని ఇంటర్మీడి యట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అవసర మైతే అదనపు సెక్షన్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని బట్టి బ్యాచ్‌ల వారీగా క్లాసు లు నిర్వహిస్తారు. పదో తరగతిలో అందరినీ పాస్ చేయడం వల్ల ఇంటర్లో ఎక్కువ మంది చేరే అవకా శముంది. ప్రతి ఒక్కరికీ కాదనకుండా సీటు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని అధికారులు భావి స్తున్నారు. పైగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లేకపోతే వారంతా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ ఫీజులు చెల్లించి చేరాల్సి వస్తుంది. టెన్త్‌లో అందరినీ పాస్ చేసి ఇంటర్లో సీటు లేదని చెప్పడం సబబు కాద న్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే 75 వేల మంది వరకు చేరారని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్ల మేరకు సీట్ల పెంపు రాష్ట్రంలో 5.70 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు. మొత్తం 2,500 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు న్నాయి. వాటిల్లో 5 లక్షల వరకు సీట్లున్నాయి. 405 ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 80 వేల మంది దాకా చేరుతుంటారు. సాధారణంగా ప్రతి కాలేజీలో సీఈసీ, హెచ్ఈసీ కలిపి 88 సీట్లు ఉంటాయి. బైపీసీ, ఎంపీసీకి కలిపి మరో 88 సీట్లు ఉంటాయి. డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులే జరుగుతున్నాయి. అందువల్ల ప్రైవేట్ కాలేజీల్లో చేరినా, ప్రభుత్వ కాలేజీల్లో చేరినా ఒకటేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సెక్షన్లు పెంచితే ఆ మేరకు బోధనా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది. అదనంగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. కాగా, 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు ఇంటర్ బోర్డు అధికారులు పొడిగించారు. -
అక్రమాలతో ‘అనుబంధం’
ఏం చేయాలి... రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం జనవరిలో ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను స్వీకరించిన తరువాత ఫిబ్రవరి నుంచే అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టాలి. ఆ తరువాత మే నెలలో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. గుర్తింపు ఉంటేనే విద్యార్థులను చేర్చుకోవాలి. ఏం చేస్తున్నారు.. మే ముగుస్తున్నా ఇంటర్ బోర్డు కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. ముడుపుల కోసమే జాప్యం చేస్తూ కాలేజీలను బోర్డు చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల పరోక్ష ఆమోదంతో ‘గుర్తింపు’లేని కాలేజీలు కూడా విద్యార్థులను చేర్చుకున్నాయి. అంతా అయ్యాక విద్యార్థుల భవిష్యత్ పేరిట లంచాలు తీసుకుని ఓకే చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపులో అక్రమాల దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మరో అవినీతి బాగోతానికి వేదికగా మారింది. ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండానే ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేసి, ఇప్పుడు అనుబంధ గుర్తింపు లేదంటూ కొందరు అధికారులే కార్పొరేట్ కాలేజీల వారీగా వసూళ్ల కోసం రేట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను ఎలాగూ చేర్చుకున్నాయి కాబట్టి వారి భవిష్యత్ పేరుతో.. ముడుపులు ముట్టజెప్పిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామంటూ పరోక్షంగా సంకేతాలు పంపించారు. గతేడాది కూడా ఇదే దందా సాగించిన బోర్డులోని కీలక అధికారులు ఇప్పుడు మళ్లీ వసూళ్లకు దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కార్పొరేట్ కాలేజీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆమోదంతోనే కొందరు జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో కీలక సిబ్బంది వసూళ్ల దందాకు తెరతీసినట్లు తెలిసింది. జనవరిలోనే దరఖాస్తులు తీసుకున్నా... రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు 2019–20 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం జనవరి 5న ఇంటర్‌బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో మార్చి 20 వరకు దరఖాస్తులను తీసుకుంది. ఈ లెక్కన ఫిబ్రవరి నుంచే అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా ఇంతవరకు పూర్తి చేయలేదు. ముడుపుల కోసమే జాప్యం చేస్తూ కాలేజీలను బోర్డు తిప్పుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 2,500కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉంటే అందులో 1,636 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే అందులో 301 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చింది. మరో 103 కాలేజీలు జియో ట్యాగింగ్‌కు అవసరమైన ఫొటోలను అప్లోడ్ చేయనందున వాటికి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈనెల 25న ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వెంటనే ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అలాగే 564 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో 545 కాలేజీలకు అనుబంద గుర్తింపును ఇచ్చింది. మిగతా 1,636 ప్రైవేటు కాలేజీల్లో 100 కాలేజీలకు ఇంతవరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. దారికి తెచ్చుకునేందుకు ముందుగా నిరాకరణ.. కాలేజీలను తమ దారికి తెచ్చుకునేందుకు నిర్ధేశిత పత్రాలు లేవంటూ గుర్తింపును నిరాకరిస్తున్నారు. కాలేజీల లీజ్ అగ్రిమెంట్, యాజమాన్య మార్పు, ఫిక్స్డ్ డిపాజిట్, శానిటేషన్, భవన నిర్మాణ అనుమతులు, కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా కాలేజీలకు గుర్తింపు ఇవ్వడం లేదు. దీంతో విసిగిపోయిన కొన్ని యాజమాన్యాలు ముడుపులు ముట్టజెప్పేందుకు ఓకే చెప్పగానే అనుబంధ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిసింది. భారీ మొత్తం వసూళ్ల కోసం..? సాధారణ కాలేజీల్లో వసూళ్లతోపాటు పది యాజమాన్యాలకు చెందిన టాప్, కార్పొరేట్ కాలేజీల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దాదాపు అన్నింటికి అనుబంధ గుర్తింపును నిలిపి వేసి, దీనికి కారణాలను చూపే పనిలో పడినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 250 వరకు ఉన్న కార్పొరేట్ కాలేజీలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. దీని కోసం బోర్డులోని కీలక అధికారి ఒకరు స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కూడా ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతేడాది కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన 66 కాలేజీల వ్యవహారంలోనూ ఇలాగే చేసినట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ పేరుతో అనుబంధ గుర్తింపు ఇవ్వకపోయినా పరీక్షలకు అనుమతించారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో వసూలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ సారీ ఇదే తరహాలో వసూళ్లకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 21నే బోర్డు మొదటి దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31లోగా మొదటి దశ ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. బోర్డు అధికారుల పరోక్ష ఆమోదంతో ‘గుర్తింపు’లేని కాలేజీలు కూడా ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఇంకేముంది యాజమాన్యాలతో కుమ్మక్కు అయిన బోర్డు అధికారులు తమ వసూళ్ల దందాలో మళ్లీ ‘విద్యార్థుల భవిష్యత్’అంటూ వాటిని కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. బేరసారాలు పూర్తయ్యాక మిగతా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* ప్రథమ సంవత్సరంలో 66%, ‘ద్వితీయ’లో 41% ఉత్తీర్ణత * రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30 వరకు దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 4,72,441 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,69,862 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెమోలను ఈ నెల 29లోగా సంబంధిత రీజినల్ ఇన్స్పెక్షన్ అధికారుల నుంచి ప్రిన్సిపాళ్లు తీసుకె ళ్లాలని రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఆ మెమోలను వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాలని, మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే విద్యార్థులు జూలై 23లోగా సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఫీజు చెల్లించి, tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. బాలికల ఉత్తీర్ణతే అత్యధికం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ పరీక్షలకు 3,02,340 మంది విద్యార్థులు హాజరుకాగా 1,99,139(66%) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 1,44,475 మంది కాగా, 1,02,375(71%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,57,865 మంది పరీక్షలకు హాజరు కాగా 96,764(61%) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,50,609 మంది హాజరు కాగా 61,438(41%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 60,985 మంది హాజరు కాగా 27,667(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 89,624 మంది పరీక్షలు రాయగా 33,771(38%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలకు 11,419 మంది హాజరు కాగా 5,152(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఒకేషనల్ పరీక్షలకు 8,073 మంది హాజరు కాగా 4,133(51%) మంది ఉత్తీర్ణులయ్యారు. వార్షిక పరీక్షలతో కలిపితే.. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణతతో ప్రస్తుత ఉత్తీర్ణతను కలిపి చూస్తే ప్రథమ సంవత్సరం జనరల్‌లో మొత్తం 2,83,560 (67.48%) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,06,907(78.71%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో ఇంప్రూవ్మెంట్ రాసేందుకు హాజరైన వారే ఎక్కువ మంది. ఇంటర్ విద్యలో సంస్కరణలు: రంజీవ్ ఆర్ ఆచార్య ఇంటర్ విద్యలో, పరీక్షలు, బోర్డు సేవల్లో అనేక సంస్కరణలు తేవడంతోపాటు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు రంజీవ్ ఆర్ ఆచార్య వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా 798 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటిసారిగా ప్రాక్టికల్ మార్కులను ఆన్లైన్ ద్వారా బోర్డుకు తెప్పించామన్నారు. ఎగ్జామినర్ పరీక్ష హాల్లో మార్కులు వేసిన వెంటనే బోర్డుకు ఆన్లైన్ ద్వారా వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. పరీక్షలకు గైర్హాజరైన వారి వివరాలు కూడా ఆన్లైన్లో పరీక్ష కేంద్రం నుంచి బోర్డుకు తెప్పించామన్నారు. 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
‘ద్వితీయ’లోనూ బాలికలదే హవా
ఇంటర్ ఫలితాలను వెల్లడించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ రంగారెడ్డి జిల్లా అత్యధిక ఉత్తీర్ణతశాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బాలికలు కూడా అంతే.. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ఫలితాలను సకాలంలో ఇచ్చినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. కొత్తగా బోర్డు ఏర్పడిన నేపథ్యంలో ఫలితాలు సకాలంలో వస్తాయా? లేదా? అన్న అనుమానం ఉన్నప్పటికీ బాగా పని చేసి సరైన సమయంలో ఫలితాలు ఇచ్చారని కొనియాడారు. భవిష్యత్తులో బోర్డు అధికారులు మరింత బాగా పని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి సతీష్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, సలహాదారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 1000 మార్కులకు గాను టాప్ మార్కులు 991. ఈ మార్కులను ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు సాధించగా, బైపీసీలో ఒక్కరే సాధించారు. మొత్తంగా చూస్తే 54.57 శాతం ఉత్తీర్ణత ఇంటర్మీడియెట్ ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 74.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం లో నిలవగా, 50.26 శాతంతో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 64.18 శాతంతో హైదరాబాద్, 64.08 శాతంతో ఖమ్మం ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రెగ్యులర్ విద్యార్థులు 3,78,973 మంది పరీక్షలకు హాజరుకాగా 2,32,742 మంది (61.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 93,500 మంది హాజరుకాగా 25,439 మంది (27.21 శాతం) పాసయ్యారు. ఇక వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 25,488 మంది పరీక్షలకు హాజరుకాగా 15,054 మంది (59.06 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 7,242 మంది హాజరుకాగా 2,474 మంది (34.38 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే అన్ని విభాగాల్లో కలిపి 54.57 శాతం మంది పాసయ్యారు. మళ్లీ బాలికలదే పైచేయి.. మొదటి సంవత్సర ఫలితాల్లోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. బాలుర కంటే బాలికలే 11 శాతం మేర అధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచారు. బాలికలు 1,90,483 మంది హాజరుకాగా 1,27,355 మంది (66.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 1,88,490 మంది పరీక్షలకు హాజరుకాగా 1,05,387 మంది (55.91 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో బాలికలు 34,486 మందికిగాను 10,857 మంది (31.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 150 మంది విద్యార్థులు డీబార్కాగా, వివిధ కారణాలతో 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. మే 1 నాటికి మార్కుల జాబితాలు మూడు రోజుల్లో మార్కుల రిజిస్టర్లను రీజనల్ ఇన్స్పెక్షన్ (ఆర్ఐవో) అధికారులకు పంపిస్తారు. మార్కుల జాబితాలను ఆర్ఐవోల నుంచి సంబంధిత ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లవచ్చు. వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. మెమోల్లో ఏమైనా పొరపాట్లు వస్తే మే 27లోగా సం బంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ♦ ఫీజు చెల్లింపునకు మే 6 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు ఉంటాయి. ఎథిక్స్, మానవీయ విలువల పరీక్ష జూన్ 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 9న ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్లో http://bie.telangana.gov.in త్వరలోనే పొందుపరుస్తారు. విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును మే 6వ తేదీలోగా చెల్లించాలి. ఆలస్య రుసుముతో చెల్లింపునకు అవకాశం లేదు. ప్రైవేటు విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయి. వొకేషనల్ కోర్సులు చదివిన పాత విద్యార్థులు పాత సిలబస్‌లో పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం. హాజరు మినహాయింపు పొందిన వారు ఆర్ట్స్, కామర్స్ పరీక్షలకోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను కలసి ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, ఫొటో కాపీకి అవకాశం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 600 చొప్పున మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి.