గవర్నర్ ప్రత్యేకాధికారాలను స్వాగతిద్దాం
1956కు పూర్వం స్థానికతను వ్యతిరేకిద్దాం.. సెటిలర్లకు అండగా ఉందాం
గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో సమీక్షలో టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్న సీమాంధ్రులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. దీనికితోడు ఉమ్మడి రాజధానిలో సెటిలర్ల రక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్ లేవనెత్తే అభ్యంతరాలను దీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది.
గాంధీభవన్‌లో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిగింది. మాజీమంత్రి, నగర పార్టీ ఇంచార్జి షబ్బీర్‌అలీ, డీసీసీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఎంపీ ఎం.ఏ. ఖాన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎ మ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నేతలు జయసుధ, డాక్టర్ పి.వినయ్‌కుమార్, వినోద్‌కుమార్, పల్లె లక్ష్మణ్‌గౌడ్, బండ కార్తీకరెడ్డి, దిడ్డి రాంబాబు, జి.రాజ్‌కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకాగా, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ గైర్హాజరయ్యారు.
పార్టీ బలోపేతం వంటి అంశాలతోపాటు ఈ ఏడాది చివర్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సుమారు 20 లక్షల మంది సీమాంధ్రులకు అండగా నిలబడటం ద్వారా త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని పలువురు నేతలు ప్రతి పాదించారు. మజ్లిస్‌తో పొత్తు అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.