seemandhra settlers
-
‘తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్రులకు సీట్లు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులకు 20 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలను రాసినట్లు వివరించారు. బుధవారం నాంపల్లిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది మంది సీమాంధ్రులు స్థిరపడినట్లు వివరించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా పన్నుల రూపంలో సీమాంధ్రులు ఆదాయాన్ని సమకూర్చుతున్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యం లేకుండా పోయిందన్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణలో సరైన ప్రజాప్రతినిధి లేకపోవడంతోనే వీరి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. -
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో సెటిలైన సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, ఈ సారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నాం. కొన్ని చోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తాం. అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పింది. కాంగ్రెస్‌పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ మావైపే ఉంటారు. పాతబస్తీలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థులను నిలబెడతాం. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయి. కాబట్టే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ మా విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని ఉత్తమ్ తెలిపారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు..: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయబోతున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నేటి విలేకరుల భేటీలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవును. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా! హైదరాబాద్‌లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారీ టికెట్ ఇచ్చినవాడు యుద్ధం చేసేందుకు రెడీగా ఉండాలి. ఉత్తమ్ మనిషనో, ఇంకొకరి మనిషనో టికెట్లు ఇవ్వరు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల పాదయాత్రల ఫలితాలు హైకమాండ్ విశ్లేషిస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. రాహుల్ అలా అనలేదు: దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి క్లియర్‌గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. క్లిష్టమైన స్థానాల్లో హైకమాండ్‌దే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు చాలా సహజం. అయితే ఎన్నికల్లో అందరం ఒక్కటిగా పనిచేస్తాం’’ అని ఉత్తమ్ వివరించారు. -
గవర్నర్ ప్రత్యేకాధికారాలను స్వాగతిద్దాం
1956కు పూర్వం స్థానికతను వ్యతిరేకిద్దాం.. సెటిలర్లకు అండగా ఉందాం గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో సమీక్షలో టీపీసీసీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరనివాసం ఉంటున్న సీమాంధ్రులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. దీనికితోడు ఉమ్మడి రాజధానిలో సెటిలర్ల రక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయంలో టీఆర్ఎస్ లేవనెత్తే అభ్యంతరాలను దీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. గాంధీభవన్‌లో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిగింది. మాజీమంత్రి, నగర పార్టీ ఇంచార్జి షబ్బీర్‌అలీ, డీసీసీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఎంపీ ఎం.ఏ. ఖాన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎ మ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నేతలు జయసుధ, డాక్టర్ పి.వినయ్‌కుమార్, వినోద్‌కుమార్, పల్లె లక్ష్మణ్‌గౌడ్, బండ కార్తీకరెడ్డి, దిడ్డి రాంబాబు, జి.రాజ్‌కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకాగా, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ గైర్హాజరయ్యారు. పార్టీ బలోపేతం వంటి అంశాలతోపాటు ఈ ఏడాది చివర్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సుమారు 20 లక్షల మంది సీమాంధ్రులకు అండగా నిలబడటం ద్వారా త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని పలువురు నేతలు ప్రతి పాదించారు. మజ్లిస్‌తో పొత్తు అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
కేసీఆర్.. సెటిలర్లకు క్షమాపణ చెప్పు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వెంటనే తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడంలో సెటిలర్ల భాగస్వామ్యం ఉందని, అలాంటప్పుడు వాళ్ల ఓట్ల కోసం ప్రత్యేకించి వెంపర్లాడాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వీజీఆర్ నారగోని, తెలంగాణ మాదిగ పోరాట సమితి నాయకుడు తాటికాయల జయరాం మాదిగతో పాటు మహాత్మాగాంధీ ఆటో యూనియన్‌కు చెందిన పలువురు నాయకులు శనివారం పొన్నాలను కలిసి, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్కు రావనే నైరాశ్యంతోనే కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. -
విభిన్నమైన బరి.. మల్కాజిగిరి
మల్కాజిగిరి.. దేశంలోనే అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి. దీని మీద ఇప్పుడు ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది నాయకులు కన్నేశారు. ఇక్కడినుంచి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో అడుగుపెట్టాలని విశ్వప్రయత్నాలుచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. ఇలా ఈ జాబితా చెప్పుకుంటూ పోతే చాలా పొడుగు అవుతుంది. అయితే అసలు ఇంతమంది ఈ స్థానం మీద కన్నేయడానికి కారణం ఏంటి? అది కూడా.. ఎక్కువ మంది తటస్థులు తెలంగాణ ఉద్యమంతో మరీ అంత ఎక్కువ సంబంధం లేనివాళ్లే ఇటు చూడటానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? తరచి చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ నియోజకవర్గం పెద్దది మాత్రమే కాదు.. పట్టణ మధ్య తరగతి, చదువుకున్న ఓటర్లు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. 2008లో నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఏర్పడిన మల్కాజిగిరిలో 90 శాతం ఓటర్లు పట్టణ మధ్యతరగతి వాళ్లే. 2009 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 45% ఓట్లు మాత్రమే పోలవ్వగా, సర్వే సత్యనారాయణ ఎన్నికై, చివరకు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మల్కాజిగిరిలో మరో విశేషం.. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఓటర్లు సీమాంధ్ర సెటిలర్లే. నగర శివార్లలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 70 శాతం మంది సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవాళ్లే. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ క్రిస్టియన్లు, దళిత ఓటర్లతోపాటు సీమాంధ్ర సెటిలర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారని, ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని సర్వే నిపుణులు చెబుతున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కులాల వర్గీకరణను బట్టి కూడా నాయకులు తమ తమ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. రెడ్డి, కమ్మ వర్గీయులు ఇక్కడ 20 శాతం మంది చొప్పున ఉండగా, బ్రాహ్మణులు 80 వేల మంది ఉన్నారు. వీళ్లు ప్రధానంగా మల్కాజిగిరి, కూకట్పల్లి, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నారు. ఇక క్రిస్టియన్లు, దళితులు ప్రధానంగా సింకింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోను, ఆ చుట్టుపక్కలే ఉన్నారు. దాదాపు 50 వేల మంది ముస్లిం ఓటర్లు కూడా ఇక్కడ ఉండటం మరో ముఖ్యమైన అంశం. ఇన్ని ప్రత్యేకతలున్న మల్కాజిగిరి.. ఈసారి ఎవరికి పట్టం కడుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.