సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో సెటిలైన సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, ఈ సారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు.
‘‘హైదరాబాద్‌లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నాం. కొన్ని చోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తాం. అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పింది. కాంగ్రెస్‌పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ మావైపే ఉంటారు. పాతబస్తీలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థులను నిలబెడతాం. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయి. కాబట్టే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ మా విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని ఉత్తమ్ తెలిపారు.
టీడీపీతో కాంగ్రెస్ పొత్తు..: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయబోతున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నేటి విలేకరుల భేటీలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవును. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా! హైదరాబాద్‌లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారీ టికెట్ ఇచ్చినవాడు యుద్ధం చేసేందుకు రెడీగా ఉండాలి. ఉత్తమ్ మనిషనో, ఇంకొకరి మనిషనో టికెట్లు ఇవ్వరు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల పాదయాత్రల ఫలితాలు హైకమాండ్ విశ్లేషిస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు.
రాహుల్ అలా అనలేదు: దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి క్లియర్‌గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. క్లిష్టమైన స్థానాల్లో హైకమాండ్‌దే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు చాలా సహజం. అయితే ఎన్నికల్లో అందరం ఒక్కటిగా పనిచేస్తాం’’ అని ఉత్తమ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment