విభిన్నమైన బరి.. మల్కాజిగిరి | malkajgiri loksabha constituency consists of seemandhra settlers a lot | Sakshi
Sakshi News home page

విభిన్నమైన బరి.. మల్కాజిగిరి

Published Mon, Apr 7 2014 11:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

విభిన్నమైన బరి.. మల్కాజిగిరి - Sakshi

విభిన్నమైన బరి.. మల్కాజిగిరి

మల్కాజిగిరి.. దేశంలోనే అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి. దీని మీద ఇప్పుడు ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది నాయకులు కన్నేశారు. ఇక్కడినుంచి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో అడుగుపెట్టాలని విశ్వప్రయత్నాలుచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. ఇలా ఈ జాబితా చెప్పుకుంటూ పోతే చాలా పొడుగు అవుతుంది. అయితే అసలు ఇంతమంది ఈ స్థానం మీద కన్నేయడానికి కారణం ఏంటి? అది కూడా.. ఎక్కువ మంది తటస్థులు తెలంగాణ ఉద్యమంతో మరీ అంత ఎక్కువ సంబంధం లేనివాళ్లే ఇటు చూడటానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? తరచి చూస్తే అసలు విషయం బయటపడుతుంది.

ఈ నియోజకవర్గం పెద్దది మాత్రమే కాదు.. పట్టణ మధ్య తరగతి, చదువుకున్న ఓటర్లు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. 2008లో నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఏర్పడిన మల్కాజిగిరిలో 90 శాతం ఓటర్లు పట్టణ మధ్యతరగతి వాళ్లే. 2009 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 45% ఓట్లు మాత్రమే పోలవ్వగా, సర్వే సత్యనారాయణ ఎన్నికై, చివరకు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మల్కాజిగిరిలో మరో విశేషం.. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఓటర్లు సీమాంధ్ర సెటిలర్లే. నగర శివార్లలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 70 శాతం మంది సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవాళ్లే. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ క్రిస్టియన్లు, దళిత ఓటర్లతోపాటు సీమాంధ్ర సెటిలర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారని, ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని సర్వే నిపుణులు చెబుతున్నారు.

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కులాల వర్గీకరణను బట్టి కూడా నాయకులు తమ తమ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. రెడ్డి, కమ్మ వర్గీయులు ఇక్కడ 20 శాతం మంది చొప్పున ఉండగా, బ్రాహ్మణులు 80 వేల మంది ఉన్నారు. వీళ్లు ప్రధానంగా మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నారు. ఇక క్రిస్టియన్లు, దళితులు ప్రధానంగా సింకింద్రాబాద్‌ కంటోన్మెంటు పరిధిలోను, ఆ చుట్టుపక్కలే ఉన్నారు. దాదాపు 50 వేల మంది ముస్లిం ఓటర్లు కూడా ఇక్కడ ఉండటం మరో ముఖ్యమైన అంశం. ఇన్ని ప్రత్యేకతలున్న మల్కాజిగిరి.. ఈసారి ఎవరికి పట్టం కడుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement