మువ్వన్నెల రెపరెపలకు ముస్తాబైన గోల్కొండ
► నేడు జాతీయ జెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్
► పది గంటలకు పతాకావిష్కరణ.. ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా మూడో ఏడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోల్కొండపై జెండా ఎగరవేయనున్నారు. ఘనంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం సీఎం అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు.
గవర్నర్ శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ఎందరో నిస్వార్థ దేశభక్తుల త్యాగ నిరతికి ఈ వేడుకలు నిదర్శనమని తన సందేశంలో పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశభక్తులను స్మరించుకోవాలని.. ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.