ఇక ‘స్టార్టప్ ఇండియా’...
పరిశ్రమల స్థాపన ప్రోత్సాహానికి మోదీ కొత్త పథకం
* నల్లధనం వెనక్కు తేవటం సుదీర్ఘమైన ప్రక్రియ.. ఇప్పటికే రూ. 6,500 కోట్ల విదేశీ ఆస్తుల వివరాలు లెక్కలోకి వచ్చాయి.. పీఎంఎల్‌ఏ కింద రూ. 4,500 కోట్ల నిధులు సమకూరాయి
* ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో పరిశ్రమల వ్యవస్థాపనను ప్రోత్సహించటానికి ‘ఆరంభించు ఇండియా-నిలబడు ఇండియా’ (స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా) నినాదంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ పేరును ‘వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ’గా మార్చనున్నట్లు తెలిపారు. దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారత 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ శనివారం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి.. జాతినుద్దేశించి ప్రసంగించారు. కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ.. 85 నిమిషాలు మాట్లాడారు.
ఒక ప్రధాని సుదీర్ఘ పంద్రాగస్టు ప్రసంగం బహుశా ఇదేనని భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతం కొనసాగిన ప్రతిష్టంభన గురించి మోదీ ప్రసంగంలో ప్రస్తావించలేదు. యువతలో పరిశ్రమ వ్యవస్థాపనను ప్రోత్సహించేందుకు ‘స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచటంతో పాటు.. రైతుల సంక్షేమాన్నీ పట్టించుకునేలా వ్యవసాయ శాఖ పేరు మారుస్తున్నట్లు తెలిపారు. మాజీ సైనికోద్యోగులు డిమాండ్ చేస్తున్న ఒక ర్యాంకు - ఒక పెన్షన్ (ఓఆర్‌ఓపీ) పథకాన్ని తమ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందన్నారు.
శ్రమను గౌరవిస్తామని హామీ ఇస్తూ.. గనుల ప్రాంతాల సంక్షేమం కోసం రూ. 6,000 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. గత పంద్రాగస్టు నాడు ప్రకటించిన పథకాలను, ఇప్పటివరకూ సాధించిన విజయాలనూ ప్రస్తావించారు. అవినీతి రహిత దేశంగా మార్చటానికి కట్టుబడి ఉన్నామన్నారు. నల్లధనం నియంత్రణకు కఠిన చట్టం చేశామని చెప్పారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం... దేశంలో యువత పారిశ్రామిక వ్యవస్థాపన, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించేందుకు ‘ఆరంభించు ఇండియా-నిలబడు ఇండియా’ నినాదంతో పథకం తెస్తున్నా. దేశంలోని 1.25 లక్షల బ్యాంకు శాఖలు.. ఒక్కో శాఖ కనీసం ఒక దళిత పారిశ్రామికవేత్తను, ఒక ఆదివాసీ పారిశ్రామికవేత్తను, ఒక మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహించాలి. తయారీ పరిశ్రమలు ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రోత్సాహకాల ప్యాకేజీ ఇస్తాం. జూనియర్ స్థాయిల్లోనూ నియామకాల ఇంటర్వ్యూలు చేపట్టే విధానానికి త్వరగా స్వస్తి పలకాలి. గత ఏడాది మే నెలలో మేం అధికారంలోకి వచ్చేటప్పటికి ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది.
మా చర్యల వల్ల అది ఇప్పుడు 3, 4 శాతానికి తగ్గిపోయింది. ఎల్పీజీ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు అందించడం వల్ల అక్రమాలు తగ్గి ఏటా రూ. 15వేల కోట్లు ఆదా అవుతోంది. స్కూళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం దాదాపుగా సాధించింది. దేశంలో 2.62 లక్షల స్కూళ్లు ఉన్నాయని.. వాటిలో 4.25 లక్షల మరుగుదొడ్లు అవసరమని గుర్తించాం. జన్‌ధన్ కింద 17 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో రూ. 20 వేల కోట్లను జమ చేయడం పేదల సుసంపన్నత ప్రతిఫలిస్తోంది. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు, విద్యుత్తు వంటి కనీస సేవల అందుబాటుతో.. 2022 నాటికి.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఆదివారం నుంచి రెండు రోజులపాటు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు.
వ్యవసాయంతో పాటే రైతు సంక్షేమం
రైతుల , వారి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో.. వ్యవసాయ శాఖ పేరును ‘వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ’గా మారుస్తాం. వ్యవసాయాభివృద్ధితో పాటు.. రైతుల వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాబోయే రోజుల్లో పలు పథకాలను రూపొందిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచటం, రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించటంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోంది.
ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి చుక్కకూ మరింత పంట సాధించటంపై దృష్టి పెట్టాలి. రైతులు కేవలం వేపనూనె పూతతో కూడిన యూరియానే వాడాలి. దీనివల్ల రాయితీ యూరియా వ్యవసాయేతర రంగాలకు మళ్లించటం నిలిచిపోతుంది.
అవినీతి రహిత భారత్‌గా మారుస్తాం..
అవినీతిపై పోరాటానికి మా నిబద్ధతను మేం విలేకరుల సమావేశాల్లో ప్రదర్శించలేదు. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి ప్రదర్శించాం. ఫలితాలు సాధించాం. వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించాం. భారత్‌ను అవినీతి రహిత దేశంగా మారుస్తాం. కిందిస్థాయిల్లో అవినీతి చీడ కొనసాగుతూనే ఉంది. పేదమనిషి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. జాతీయ అంతరాత్మను మేల్కొలపాల్సిన అవసరముంది.
మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 800 అవినీతి కేసులే నమోదయ్యాయి. మా ప్రభుత్వం వచ్చాక 1,800 అవినీతి కేసులు నమోదయ్యాయి. అధికారులపై చర్యలూ తీసుకున్నాం. నల్లధనాన్ని వెనక్కు తెచ్చే ప్రక్రియ సుదీర్ఘమైనది. కానీ.. కృషి కొనసాగుతోంది. ప్రయోజనాలు వస్తున్నాయి. మేమొక కఠిన చట్టం చేశాం. అప్పట్నుచీ అంతకుముందు లెక్క చెప్పని రూ. 6,500 కోట్ల విదేశీ ఆస్తులను లెక్కలోకి తీసుకురావటం జరిగింది.
అలాగే.. మనీ ల్యాండరింగ్ నిరోధ చట్టం కింద కఠిన చర్యల ద్వారా గత పది నెలల్లో మరో రూ. 4,500 కోట్లు వచ్చాయి. పీఎంఎల్‌ఏ చట్టం చేశాక గత పదేళ్లలో రూ. 10 వేల కోట్లు వస్తే.. అందులో రూ. 4,500 కోట్లు గత పది నెలల్లోనే వచ్చాయి. నల్లధనంపై పోరాటంలో భాగంగా.. భారతీయులకు విదేశాల్లో గల ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా అమెరికా సహా పలు దేశాలతో ఒప్పందాలు చేసుకోవటం వంటి చర్యలు చేపట్టాం. ఇప్పుడు ఎవరూ నల్లధనాన్ని విదేశాలకు పంపే సాహసం చేయరు.