హర్తాళ్‌పై సర్కారు దౌర్జన్యం
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
- గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులెందుకు?
- నోట్ల రద్దుపై టీడీపీ విధానమేమిటి?
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేరుుంచిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేరుుంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో బొత్స మాట్లాడుతూ.. హర్తాళ్‌పై బలప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇంతకీ నోట్ల రద్దుపై టీడీపీ విధానమేమిటని నిలదీశారు. నల్లధనాన్ని వెలికితీయటానికి కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా వైఎస్‌ఆర్‌సీపీ సమర్థిస్తుందని, వాటి వల్ల సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. బ్యాంకర్ల అసోసియేషన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా కోరిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. దేశ చరిత్రలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ను రాజీనామా చేయమన్న డిమాండ్ ఎప్పుడూ లేదని బొత్స తెలిపారు.
ఫ్యూచర్ గ్రూప్‌కు నగదు లావాదేవీలా..?
సహకార సొసైటీల్లో రాజకీయాల పేరుతో నగదు మార్పిడికి అనుమతించని ప్రభుత్వం చంద్రబాబుతో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లలో 200 ఏటీఎం సెంటర్లు ప్రారంభించాలని ఎలా నిర్ణయం తీసుకుంటుందని బొత్స దుయ్యబట్టారు. దేశంలో ప్యూచర్ గ్రూప్ తప్ప ఇంకే రిటైల్ స్టోర్లు లేవా? అని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షోభంలో ఉంటే దాంట్లో కూడా బాబు వ్యాపార కోణం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊహించినట్లే చంద్రబాబుతో ఆర్థిక సంబంధాలు ఉన్న సంస్థలకు మినహారుుంపులు ఇస్తున్నారని, రూ.14 వేల కోట్ల బకారుుల్ని రద్దు ద్వారా కేంద్రం ఎలాంటి సంకేతాలిస్తోందని ప్రశ్నించారు. ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అంటూ చంద్రబాబు ప్రజల్ని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాలకు ఎంత మేర ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో ఆయనే చెప్పాలన్నారు. ఇంకో రెండు రోజుల్లో జీతాలు ఇవ్వాలని, అప్పుడూ ఇలాంటి పరిస్థితే ఉంటే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై ఉపసంఘాన్ని వేస్తున్నారని, దీనికి చంద్రబాబు అధ్యక్షుడుగా ఉండాలని అరణ్ జైట్లీ అడిగారని విలేకరులు ప్రశ్నించగా.. అరుణ్‌జైట్లీ అడిగారా? లేక ఈయనే సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.