సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్దేశించుకుంది. అంతేకాదు కాలేజీలన్నింటికీ పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ రూపొందించిన 2024 డాక్యుమెంట్‌లో పలు అంశాలను పొందుపరిచింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 500కి పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉండటంతో గ్రామీణ నిరుపేద విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలేజీలు లేని మండలాల్లో వాటి ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధుల వివరాలను ఆ డాక్యుమెంట్‌లో పొందు పరిచింది.
ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 10 శాతం చొప్పున విద్యార్థుల నమోదును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఫలితాలను సాధించేలా కార్యాచరణను రూపొందించింది. అలాగే జూనియర్ కళాశాలల అభివృద్ధికి 23 రకాల అంశాలను గుర్తించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఇవీ డాక్యుమెంట్‌లోని ప్రధానాంశాలు
♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించడం.
♦ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేయడం.
♦ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టడం. జీతభత్యాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేయడం.
♦ విద్యార్థినుల కోసం వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయడం.
♦ కాలేజీల్లో ఖాళీలు లేకుండా బోధనా సిబ్బంది నియామకం చేపట్టడం. ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం లెక్చరర్లను వీలైనంత తొందరగా నియమించడం.
♦ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చే ప్రైవేట్ జూనియర్ కాలేజీలను నియంత్రించడం.
♦ ఇంటర్ పరీక్షా పత్రాన్ని విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యేలా రూపొందించడం.
♦ నిపుణులైన బోధనా సిబ్బంది సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వర్చువల్ తరగతులను నిర్వహించడం.
♦ డిజిటల్ లైబ్రరీ, కెరీర్ గైడెన్స్, స్పెషల్ తరగతులు, పున:శ్చరణ తరగతులను నిర్వహించడం.
♦ కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయడం.
♦ కాలేజీల భద్రత కోసం స్వీపర్, వాచ్‌మెన్, స్కావెంజర్ పోస్టులను భర్తీచేయడం.
♦ పరిస్థితులకు అనుగుణంగా బోధనా సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.
♦ వొకేషనల్ విద్యార్థుల ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించడం.
Comments
Please login to add a commentAdd a comment