సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య నియమితులైన ఉద్యోగులకు శుభవార్త! వీరికి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)కి బదులు సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్) పథకాన్ని వర్తింపజేసేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు పూర్తి చేశాయి. విద్యుత్ కార్మిక సమ్మె పిలుపు విరమణ కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీఈటీయూఎఫ్)కు 2016 జూన్‌లో విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చిన పలు హామీల్లో జీపీఎఫ్ అమలు ఒకటి ఉంది.
ఈ నేపథ్యంలో ఆ సమయంలో నియమితులైన 4,717 మంది విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు ద్వారా విద్యుత్ సంస్థలపై పడే ఆర్థిక భారంపై ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో ట్రాన్స్‌కో యాజమాన్యం అధ్యయనం జరిపించింది. జీపీఎఫ్ అమలు చేస్తే విద్యుత్ సంస్థలపై రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని కన్సల్టెన్సీ నివేదించింది. పెన్షన్ల చెల్లింపులకు రూ.1,068.17 కోట్లు, గ్రాట్యుటీకి రూ.175.49 కోట్లు కలిపి మొత్తం రూ.1,243.66 కోట్ల భారం పడనుందని తేల్చింది.
ప్రస్తుతం ఉన్న గ్రాట్యుటీ ట్రస్ట్ నుంచి రావాల్సిన రూ.175.49 కోట్లు, ఈపీఎఫ్ నుంచి రావాల్సిన రూ.275.95 కోట్ల నిధులను సర్దుబాటు చేస్తే తుదకు రూ.792.22 కోట్ల అదనపు భారం పడనుందని లెక్కగట్టింది. ఆ విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ పథకాన్ని వర్తింపజేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ట్రాన్స్‌కోలో 163 మంది, జెన్‌కోలో 1,304 మంది, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,636 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 1,614 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment