చెట్ల నరికివేత తగ్గించడం, మరో చోట నాటడంపై ఓ కమిటీ వేయండి
ఆ కమిటీలో పర్యావరణ నిపుణులకు స్థానం కల్పించండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా చెట్ల నరికివేతపై ఆందోళన
నరికివేతకు బదులు ట్రాన్స్‌లొకేషన్‌కు ప్రాధాన్యతనివ్వాలని వెల్లడి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్‌లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌లొకేషన్‌కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్‌లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.
ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంది.
ట్రాన్స్‌లొకేషన్ కోసం పిల్...
రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు.
జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం
» ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు
»ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి
» ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్‌ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు.
ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్‌కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment