అలజడి..!
► గ్రేటర్‌లో 13 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విచారణ
► బాలానగర్, కూకట్‌పల్లి కార్యాలయాల్లో భారీ అవకతవకలు
► తేలనున్న అడ్డదారి రిజిస్ట్రేషన్ల లెక్కలు రంగంలోకి విచారణ కమిటీ..
► పగలనున్న అక్రమాల పుట్ట
సాక్షి,సిటీబ్యూరో: అడ్డదారులు, అక్రమ వసూళ్లతో గాడితప్పిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త కలకలం మొదలైంది. నగరంలో నిషేధిత భూములు, తక్కువ విలువతో రిజిస్టర్ అయిన అక్రమాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించనుంది. ఈ అక్రమాల గుట్టు విప్పేందుకు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల రిజిస్ట్రార్లు ట్వింకిల్ జాన్, సుభాషిణిలో రంగంలోకి దిగారు. వాస్తవానికి అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కూకట్‌పల్లి, బాలానగర్ కార్యాలయాలపై విచారణ చేయాలన్న డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ఏకంగా జంట జిల్లాల్లోని 13 కార్యాలయాలపై విచారణకు ఆదేశించటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేగుతోంది.
కాసులు కురిపిస్తున్న నిషేధిత భూములు
ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (ఏ కార్యాలయం నుంచైనా రిజిస్ట్రేషన్) జంట జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ తదితర భూములను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దని జిల్లా కలెక్టర్లు రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అయినా నగరంలో భారీగా బై నెంబర్లు వేసి ఖరీదైన భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి తోడు నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల విలువను తక్కువగా చూపి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారులుగా నియమితులైన ట్వింకిల్ జాన్, సుభాషిణి నిస్పక్షపాతంగా విచారణ జరిపి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారా.. లేక, వత్తిళ్లకు లొంగిపోతారా.. అన్న అంశాన్ని ఆశాఖ ఉద్యోగులు, సిబ్బందే ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. త్వరలో పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంబంధిత రిజిస్ట్రార్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చాకే డాక్యుమెంట్ రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
అక్రమాల ఆనవాళ్లు ఇవిగో..
► అత్తాపూర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో 355/1,2,3 నంబర్ల అత్యంత విలువైన వక్ఫ్ భూమి వివాదం కోర్టులో ఉండగా ఓ స్థిరాస్తి సంస్థ చేసిన ప్లాట్లను బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేశారు.
► మియాపూర్ మదీనాగూడ గ్రామ సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను రిజిస్టర్ చేయవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. కానీ 100 సర్వే నెంబర్ పక్కన నెంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు.
► ఎల్‌బీనగర్ పరిధిలోని తుర్కయాంజిల్, రామన్నగూడ తదితర ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు సేకరణ పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంచారు. అయినా నాలుగింతల మొత్తాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.
► శేరిలింగంపల్లి గోపన్‌పల్లి సర్వే నెంబర్ 124లో 279.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూమి మినహా, మిగతా దాన్ని ప్రొహిబిటెడ్ జాబి తాలో చేర్చి రిజిస్ట్రేషన్లు చేయరాదని 2007లోనే నిర్ణయించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ నిర్ణయంతో కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేశారు.