భగ్గుమన్న గ్రూప్-2 అభ్యర్థులు | Group -2 candidates are fire | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న గ్రూప్-2 అభ్యర్థులు

Published Thu, Mar 17 2016 4:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

భగ్గుమన్న గ్రూప్-2 అభ్యర్థులు - Sakshi

భగ్గుమన్న గ్రూప్-2 అభ్యర్థులు

హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాలను 439 నుంచి 3,500కు పెంచాలని, పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయలం వద్ద ఆందోళనకు దిగారు. వందలాది మంది నిరుద్యోగుల ఆందోళనతో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఐదు గంటల పాటు కేంద్ర గ్రంథాలయం అట్టుడికింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రూప్ అభ్యర్థులు నిరసన తెలిపారు. వారి ఆందోళనను విరమింపచేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రూప్ అభ్యర్థుల ఆందోళనకు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ జె.కళ్యాణ్ మద్దతుపలికి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లోగా తమ డిమండ్లను పరిష్కరించాలని లేదంటే అసెంబ్లీకి మార్చ్‌ను నిర్వహిస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 18న చలో అసెంబ్లీ, 21వ తేదీన ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. గ్రూప్ అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు ఘటనా స్థలానికి వచ్చిన బీసీ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. అనంతరం పోలీసులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ జె.కళ్యాణ్, క్రాంతి, గణేష్, భీమ్‌రావు నాయక్‌తో పాటు 35 మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. టఫ్ కన్వీనర్ విమలక్క, పీడీఎస్‌యూ నాయకుడు సంతోష్ తదితరులు గ్రూప్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
 
 ఇవీ డిమాండ్లు..
 గ్రూప్-2 ఉద్యోగాలను 439 నుంచి 3,500కు పెంచాలి. లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. గ్రూప్-2 ఇంటర్వ్యూలు ఎత్తివేయాలి. గ్రూప్ పరీక్షలు మూడు నెలలు వాయిదా వేయాలి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తమ వద్దకు రావాలి. ఏప్రిల్ 3న ఒకే రోజు జరిగే ఆర్‌ఆర్‌బీ, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేయాలి. ఎస్సై పరీక్షల్లో ఇంగ్లిష్ వెయిటేజీ మార్కులను ఎత్తివేయాలి. తెలుగు అకాడమీ బుక్స్‌ను వెంటనే విడుదల చేయాలి.
 
 5 లక్షల మందికి 439 పోస్టులా?
 రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 60 వేల మంది గ్రూప్-2 కోసం ఎదురుచూస్తుంటే కేవలం 439 ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం సమంజసం కాదు. వెంటనే 3,500 పోస్టులు భర్తీ చేయాలి. అకడమిక్ బుక్స్‌ను వెంటనే విడుదల చేయాలి.
 - సాయికిరణ్, గ్రూప్-2 అభ్యర్థి
 
 3,500 పోస్టులు భర్తీ చేయాలి
 గ్రూప్-2ను వాయిదా వేసి 3,500 పోస్టులను భర్తీ చేయాలి. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం. ఇంటర్వ్యూలను రద్దు చేసి పరీక్షలను నిర్వహించాలి.
 - సంధ్య, గ్రూప్-2 అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement