
హైదరాబాదీలుగా గుజరాత్ జంట మోసం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్‌పోర్ట్‌లతో కెనడా వెళ్లడానికి యత్నించిన గుజరాతీ ‘జంట’ను అబుదాబి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మరొకరి పాస్‌పోర్ట్స్‌పై తమ ఫొటోలు అతికించి ప్రయాణిస్తున్నారని గుర్తించి బలవంతంగా అహ్మదాబాద్‌కు తిప్పి పంపారు. ఇరువురినీ అరెస్టు చేసిన అక్కడి సర్దార్‌నగర్ పోలీసులు ‘హైదరాబాద్ కోణం’పై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్స్ కలిగిన అసలు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపిస్తున్నారు. అక్రమ వలసలు పెరిగిపోతున్నాయనే కారణంగా కెనడా, అమెరికా దేశాలు గుజరాతీయులకు వీసాలు జారీ చేడయం దాదాపు ఆపేశాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వారు ఆయా దేశాలకు వెళ్లడానికి నకిలీ పాస్‌పోర్ట్స్ వినియోగిస్తుండటం పరిపాటిగా మారింది. 2007లో వెలుగులోకి వచ్చి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనుషుల అక్రమ రవాణా కుంభకోణం సైతం ఈ కోవకు చెందినదే. దీని మూలాలు హైదరాబాద్‌లోనూ బయటపడ్డాయి.
కెనడా వెళ్లేందుకు అడ్డదారి...
గుజరాత్‌లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన నేమిష్ పటేల్ (35), నరోడాలోని కృష్ణనగర్ వాసి దీప్తి పటేల్ (28) స్థిరపడేందుకు కెనడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ పాస్‌పోర్ట్స్‌పై వీసాలు రావడం కష్టమని గుర్తించిన ఆ ఇద్దరూ... రామన్ అలియాస్ లాలాభాయ్ అనే దళారీని సంప్రదించారు. ఇరువురితోనూ ఒప్పందం కుదుర్చుకున్న రామన్ వారి నుంచి ఫొటోలు సేకరించాడు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన ఒరిజినల్ పాస్‌పోర్ట్స్ చేజిక్కించుకున్న ఇతగాడు వాటిపై ఉన్న ఫొటోల స్థానంలో గుజరాతీ ‘జంట’వి అతికించాడు. ఈ పాస్‌పోర్ట్స్ తీసుకున్న నేమిష్, దీప్తి శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబి మీదుగా కెనడా వెళ్లేందుకు బయలుదేరారు. పాస్‌పోర్ట్స్‌లో ఉన్న వయసులు, ఈ ఇద్దరికీ పొంతన లేకపోయినా ఇక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందిన ఇరువురూ అబుదాబి వరకు వెళ్లిపోయారు. పాస్‌పోర్ట్స్‌ను తనిఖీ చేసిన అక్కడి అధికారులకు ఇదే విషయంలో అనుమానం వచ్చి పరిశీలించగా... ‘అతుకు’ వ్యవహారం బయపటడింది. వీరిని ప్రశ్నించిన నేపథ్యంలో పాస్‌పోర్ట్స్‌లో పేర్లకు సంబంధించిన వర్గం వారు కాదనీ స్పష్టమైంది. దీంతో నేమిష్, దీప్తిలను అదుపులోకి తీసుకున్న అబుదాబి అధికారులు ఆదివారం అహ్మదాబాద్‌కు డిపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేశారు.
కీలకంగా మారిన సిటీ కోణం...
అహ్మదాబాద్ చేసుకున్న ఇరువురినీ అదుపులోకి తీసుకున్న సర్దార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పటి వరకు నకిలీ పాస్‌పోర్ట్స్‌తో ప్రయాణిస్తున్న వారిని పట్టుకున్న అక్కడి పోలీసులకు ఈ తరహా కేసు దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్‌పోర్ట్స్ అహ్మదాబాద్‌లోని దళారీ రామన్‌కు ఏలా చేరాయన్నది ఇక్కడి కీలకంగా మారింది. దీంతో పాస్‌పోర్టుల ‘యజమానుల్ని’ ప్రశ్నించడం కోసం సర్దార్‌నగర్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన వివరాలను సర్దార్‌నగర్ పోలీసులు సేకరించారు. రామన్ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన వారితో పాటు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులూ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.